శాస్త్ర సాంకేతికత పెరిగిన కొద్ది.. మన జీవితం మరింత సౌకర్యవంతంగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు మనిషికి ఏదైనా తీవ్ర ప్రమాదం జరిగితే.. ఏకంగా అవయవాలనే తొలగించేవారు. కానీ ఇప్పుడు.. ఈ పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చింది. ప్లాస్టిక్ సర్జరీ వంటి అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చి.. బాధితులకు ఎంతో మేలు చేస్తున్నాయి. అయితే ఒకప్పుడు కేవలం ప్రైవేట్ వైద్యులు మాత్రమే ఈ ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించేవారు.
కానీ ప్రస్తుతం ఈ అత్యాధునిక శస్త్రచికిత్స.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా అందుబాటులో ఉంది. ఫలితంగా ఎలుగు బంటి దాడిలో మూడొంతుల ముఖం ఛిద్రమైనప్పటికి.. వైద్యులు ఎంతో కష్టపడి బాధితుడికి పూర్వ రూపం కల్పించారు. సుమారు 4 గంటల పాటు కష్టపడి.. 300 కుట్లు వేసి ఆపరేషన్ సక్సెస్ చేశారు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
గుజరాత్ అంబాపూర్ గ్రామానికి చెందిన ధర్మేష్ రాథ్వా అనే కుర్రాడు.. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా.. అతడిపై ఎలుగు బంటి దాడి చేసింది. ఈ ఘటనలో ధర్మేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి ముక్కు, నోరు, చెంపలు, మూతి, నుదుటిపై తీవ్రమైన గాయాలు అయ్యాయి. చెప్పాలంటే ఈ ప్రమాదంలో ధర్మేష్ ముఖం మూడొంతులు పూర్తిగా ఛిద్రం అయ్యింది. తీవ్రంగా గాయపడ్డ ధర్మేష్ ను తొలుత ఓ హెల్త్ సెంటర్ కి తీసుకెళ్లారు. అయితే అతడి పరిస్థితి క్రిటికల్ గా ఉండటంతో.. అక్కడి వైద్యులు.. ధర్మేష్ ను వడోదర ఎస్ ఎస్ జీ ఆస్పత్రికి తరలించారు.ఈ సందర్భంగా ఎస్ ఎస్ జీ ఆస్పత్రిలో ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్‌మెంట్, అసోసియేట్ ప్రొఫేసర్ డాక్టర్ శైలేష్ కుమార్ సోని మాట్లాడుతూ.. ‘‘ధర్మేష్ ను మా ఆస్రత్రికి తీసుకువచ్చినప్పుడు అతడి ముఖం అప్పటికే మూడొంతులు ఛిద్రం అయ్యింది. ముఖంపై చిన్న చిన్న రాళ్లు, ధాన్యం గింజలు, ఆకులు, దుమ్ము ఉన్నాయి. ఇక్కడకు తీసుకురాగానే అతడికి మొదట రేబీస్, టెటనస్, యాంటిబయాటిక్ ఇంజెక్షన్ లు ఇచ్చాం. ఆ తర్వాత ఆపరేషన్ చేయడానికి ముందు అతడికి సీటీ స్కాన్ నిర్వహించాం’’ అని తెలిపారు.
‘‘ఈ ఆపరేషన్ పూర్తి చేయడానికి సుమారు 4 గంటల సమయం పట్టింది. మొత్తం 300 కుట్లు వేశాం. ఓ పద్దతి ప్రకారం అన్ని ఎముకలను అమర్చాం. ఇదే ఆపరేషన్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేస్తే.. సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చయ్యేది. కానీ ఎస్ ఎస్ జీ ఆస్పత్రిలో ప్లాస్టిక్ సర్జరీ అందుబాటులో ఉండటంతో అతడికి వెంటనే చికిత్స చేయగలిగాం. ప్రతి రోజు ఇక్కడ 60 మందికి చెకప్ లు చేస్తున్నాం’’ అని తెలిపారు. వైద్యులు సాహసం చేశారని ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.