వివాహం అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే వేడుక. ప్రేమ, ఆకర్షణ అన్నది కూడా రెండు వేర్వేరు జాతుల మధ్య జరిగే సహజమైన ప్రక్రియ. అయితే మన శరీరంలోని హార్మోన్స్ ప్రభావం వల్ల.. పుట్టిన పుట్టుకకు విరుద్ధంగా ప్రవర్తించేవారు కూడా ఉంటారు. అయితే గతంలో పరిస్థితులు వేరుగా ఉండేవి కనుక ఇలాంటి విషయాలను బయటకు వెళ్లడించాలంటే భయపడేవారు. తల్లిదండ్రులకు చెప్పినా.. అంగీరించేవారు కాదు. ఫలితంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేవారు. అయితే మారుతున్న కాలంతో పాటు సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం స్వలింగ సంపర్కులను గుర్తించడమే కాక.. వారి వివాహాలకు కూడా చాలా దేశాలు ఆమోదం తెలుపుతున్నాయి. తాజాగా మన దేశంలో కూడా ఇలాంటి వివాహాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇక తల్లిదండ్రులు కూడా బిడ్డల సంతోషం ముఖ్యం అనుకుంటున్నారు. గతంలో హైదరాబాద్‌లో, కొన్ని రోజుల క్రితం కోల్‌కతాలో గే మ్యారేజ్‌లు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కోవకు చెందని వివాహం మరోకటి చోటు చేసుకుంది. ఈ సారి జరిగిన వివాహం ఓ గే యువరాజుది. ఆ వివరాలు..
గుజరాత్‌కు చెందిన గే యువరాజు మాన్వేంద్ర సింగ్ గోహల్ ఓ స్వలింగ సంపర్కుడిని వివాహం చేసుకున్నాడు. 2022, జూలై 6న వీరి వివాహం అమెరికాలోని కొలంబస్ లో జరిగింది. మాన్వేంద్ర సింగ్ తన సహచరుడు డీఆండ్రీ రిచర్డ్‌సన్ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని డీఆండ్రీ రిచర్డ్‌సన్ తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ పెళ్లి వైరలయ్యింది. ప్రిన్స్ మాన్వేంద్ర సింగ్.. గత కొంత కాలంగా డీఆండ్రీ రిచర్డ్‌సన్‌ను ప్రేమిస్తున్నాడు. కొన్నేళ్ల నుంచి వీరు సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
మాన్వేంద్ర సింగ్ నేపథ్యం..
మాన్వేంద్ర సింగ్ గుజరాత్‌కు చెందిన గోహిల్ రాజ కుటుంబంలో జన్మించాడు. రఘువీర్ సింగ్ రాజేంద్ర సింగ్, రాణి రుక్మిణీ దేవిల కుమారుడు మాన్వేంద్ర సింగ్. ఇతను ముంబై స్కాట్స్ పాఠశాలలో తన విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ముంబై మిథిబాయి కాలేజీ క్యాంపస్‌లో ఉన్న అమృతబెన్ జీవన్‌లాల్ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యాడు. కొన్నేళ్ల క్రితం ఇతడు వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత తాను గే అని అతడికి అర్థం అయ్యింది. దాంతో భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. తన వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా లేదని.. అనవరంగా ఓ మహిళ జీవితాన్ని నాశనం చేశానని బాధపడ్డాడు. ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించి.. ఎందరో ప్రశంసలు పొందాడు.
ఈ క్రమంలో 2006లో తనను తాను గేగా ప్రకటించుకున్నాడు. ప్రస్తుతం ఇతడికి మన దేశంలోనే కాక.. విదేశాల్లో కూడా గుర్తింపు ఉంది. 2006లో మాన్వేంద్ర స్థానిక వార్త పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. దీనిలో ఆయన తనను తాను స్వలింగ సంపర్కుడిగా చెప్పుకున్నాడు. అంతేకాక స్వలింగ సంపర్కం గురించి బహిరంగంగా మాట్లాడిన తొలి భారతీయ రాజకుటుంబ వ్యక్తిగా నిలిచాడు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ప్రస్తుతం ఆయన స్వలింగ సంపర్కుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టాడు. రాజ్‌పిప్లాలో స్వలింగ సంపర్కుల ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. దీనికి అమెరికా రచయిత జనేత్ పేరు పెట్టాడు. అంతేకాక ప్రస్తుతం ఆయన ప్యాలేస్‌లో గే సెంటర్‌ను ప్రారంభించాడు. ప్రియుడిని పెళ్లాడిన మాన్వేంద్ర సింగ్‌కు ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.