ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రమాదాలకు కారణాలు డ్రైవర్లు అతివేగంగా వాహనాలను నడపడం.. ఆ సమయంలో నియంత్రణ కోల్పోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగమే ఈ ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఆగి ఉన్న బస్సు ను ఓ ప్రైవేట్ బస్సు ఢీ కొట్టడంతో పదిమంది అక్కడికక్కడే కన్నుమూశారు. ఈ విషాద ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
గుజరాత్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రెండు బస్సులు ఢీ కొని పదిమంది మృతి చెందారు. బుధవారం కొంతమంది ప్రయాణికులు బస్సుకోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ దారుణ ఘటన జరిగింది. కోలోల్ తాలూక అంబికానగర్ బస్ స్టాప్ వద్ద కొంతమంది ప్రయాణికులు బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో ఓ బస్సు ఆగింది.. దానికి ఎదురుగా కొంతమంది నిల్చుని ఉన్నారు. అదే సమయంలో ఓ ప్రైవేట్ బస్సు అతి వేగంగా దూసుకు వచ్చి ఆగిఉన్న బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సుకు ఎదురుగా నిలబడిఉన్న ప్రయాణికులపైకి బస్సు దూసుకు వెళ్లడంతో 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఘటనా స్థలం అంతా రక్తసిక్తంగా మారిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిల్స అందించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బాకాజీ ఠాకూర్, డీఎస్సీ ప్రమాదస్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.