మంచి కుటుంబం, అందం, అణకువ, చదువు, ఉద్యోగం ఇలా అన్ని మంచి లక్షణాలున్న అమ్మాయి భార్యగా దొరికనా సరే… చాలా మంది మగాళ్లు.. ఏదో ఒక వంక పెట్టి.. వారిని ఇబ్బంది పెట్టడం, అవమానిచండం వంటివి చేస్తూనే ఉంటారు. అన్నింటికి అన్ని సరిగా ఉన్నా యువతులకే ఇలా వంకలు పెట్టి వేధించే వాళ్లు.. ఉంటే.. ఇక అంగవైకల్యం ఉన్న వారి పరిస్థితి ఏంటి. అసలు వారికి వివాహం జరగడమే గొప్పగా భావిస్తారు. ఏదో ఒక రకంగా వారికి వివాహం అయితే చాలు.. ఆఖరికి రెండో సంబంధం అయినా పర్లేదు అన్నట్లు ఆలోచిస్తారు. కాకపోతే మన సమాజంలో అక్కడక్కడ కొందరు మంచివాళ్లు ఉంటారు. మనసు మంచిది అయితే చాలు.. శరీరానికి వైకల్యం ఉన్నా పర్లేదు.. అనుకునేవాళ్లు ఇంకా ఉన్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. వారిద్దరికి పెద్దలు వివాహం నిశ్చయించారు. మరొ కొద్ది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది.
ఈలోపు ప్రమాదంలో గాయపడి.. యువతి వెన్నెముక చచ్చుపడింది. దాంతో పక్షవాతం బారిన పడింది. ఇక పెళ్లి క్యాన్సిల్ అవుతుందని అందరూ భావించారు. కానీ సదరు యువకుడు మాత్రం.. తాను ఆమెని ప్రేమించానని.. ఎన్ని కష్టాలు వచ్చినా సరే.. ఆమె చేయి విడవనని తేల్చి చెప్పాడు. అనటమేకాక.. ఆమెను వివాహం చేసుకున్నాడు. ఏడడుగులు వేయాల్సిన వేళ.. ఆమెను ఎత్తుకుని మరి ఆ తంతు పూర్తి చేశాడు. అతడి మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. ఆ వివరాలు…
ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం, అహ్మాదాబాద్‌లో చోటు చేసుకుంది. పటాన్ ప్రాంతానికి చెందిన రీన్‌లాబా అనే యువతికి, మహవీర్ సింగ్ అనే యువకుడికి ఆరు నెలల క్రితం పెద్దలు వివాహం నిశ్చయించారు. ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. ఈ క్రమంలో నిశ్చితార్థం తర్వాత రీన్‌లాబా.. స్నేహితురాళ్లతో ఆడుకుంటూ.. చెట్టు మీద నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో ఆమె వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో పక్షవాతం వచ్చి.. కదల్లేని పరిస్థితుల్లో ఉంది. ఇక తమ కుమార్తె వివాహం జరగదని రీన్‌లాబా తల్లిదండ్రులు భావించారు. అనుకున్నట్లుగానే ప్రమాదం తర్వాత రెండు కుటుంబాల సభ్యులు సమావేశం అయ్యి.. పెళ్లిని రద్దు చేయాలని నిర్ణయించారు.
అక్కడే తల్లిదండ్రులకు షాకిచ్చాడు మహవీర్. తాను రీన్‌లాబాను ప్రేమిస్తున్నానని.. ఆమె ఎలా ఉన్నా సరే.. తనను వివాహం చేసుకుంటానని తేల్చి చెప్పాడు. అయితే మహవీర్ తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. దాంతో తన పుట్టిన రోజు నాడు.. రీన్‌లాబాపై తనుకున్న ప్రేమను ఆమెకు తెలియజేసిన మహవీర్.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. రీన్‌లాబా కూడా ఎస్ చెప్పడంతో.. వెంటనే మహవీర్.. ఆమెను తన చేతుల్లో ఎత్తుకుని.. తీసుకుని వెళ్లి మరి వివాహం చేసుకున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం.. ఏడడుగులు వేయాల్సి ఉండగా.. భార్యను ఎత్తుకుని.. ఇద్దరి తరఫున తనే ఏడడుగులు వేసి.. నూతన బంధంలోకి ప్రవేశించాడు మహవీర్. అతడు చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు.