ఇక నుంచి థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింకులు తక్కువ ధరకే లభిస్తాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రేక్షకులకు ఊరట లభించనుంది. మరి ఎంత మేర ఈ ధరలు తగ్గుతాయంటే?
భారతదేశంలో ఎక్కువ మంది చూసేది క్రికెట్ అని చెప్పాలి. దాని తర్వాత సినిమా రంగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో జనాలు సినిమాలకు వెళ్తారు. మరి కొందరు అయితే మైండ్ రిలీఫ్ కోసం కూడా అలా ఒక సినిమా చూసి చిల్ అవుతుంటారు. సినీ లవర్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ముందు రోజు నుంచే సందడి మొదలవుతుంది. దీన్ని థియేటర్ యాజమాన్యాలు బాగా క్యాష్ చేసుకుంటున్నాయి. సింగిల్ స్క్రీన్స్‌ని సైతం మల్టీఫ్లెక్స్‌లుగా కన్వర్ట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మల్టీఫ్లెక్స్ థియేటర్లలో లభించే పాప్ కార్న్, కుల్ డ్రింక్స్, చిప్స్, తదితర ఆహార పదార్ధాలపై భారీగా రేట్లు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నాయి.
థియేటర్లలో లభించే ఆహార పదార్థాలపై వస్తు సేవల పన్ను GST 18 శాతం ఉన్న విషయం తెలిసిందే. ఈ పన్నుకి తోడు థియేటర్ యాజమాన్యాలు ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచడం వల్ల సినీ జనాలు సినిమాలకు రావాలంటే జంకుతున్నారు. ఒక మధ్యతరగతి కుటుంబం థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలంటే ఆలోచించే పరిస్థితి. మరి కొందరైతే OTT లోకి వచ్చాక చూద్దాంలే అనుకుంటూ సినిమాలకు కూడా వెళ్లడం మానేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే సినిమా అనేది కనుమరుగైపోతుందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యుడి జేబును గుల్ల చేసే పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ వంటి ఆహార పదార్థాల భారాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆహార పదార్థాల మీద పన్ను శాతం తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్‌కు ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై సమగ్ర విచారణ జరిపిన కౌన్సిల్ సభ్యులు 50వ సమావేశంలో పన్ను శాతాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇండియాలో అన్ని సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆహార పదార్థాలపై వసూలు చేస్తున్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికే తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్ర మంత్రులు జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే కొత్త జీఎస్టీ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. జీఎస్టీ కౌన్సిల్ 50వ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మీడియాతో మాట్లాడుతూ.. సినిమా హాళ్లలో వినియోగించే ఆహార పదార్ధాలపై 5 శాతం జీఎస్టీ ఉంటుందని కౌన్సిల్‌లో ఈ రోజు స్పష్టం చేశారు. త్వరలో మరింత సమాచారం అందిస్తామని మీడియాతో చెప్పారు. జీఎస్టీ తగ్గితే కనుక నిజంగా సినీ ప్రేక్షకులకు సగం భారం తగ్గుతుందని చెప్పవచ్చు.