ఒక్కొక్క సారి మనం చేసే కొన్ని పనులు.. ప్రాణం మీదకు తెస్తాయంటారు. కొన్ని సందర్భాల్లో ఆ అనుభవాలను స్వయంగా రుచిచూడడమో, లేదో వినడమో, చదవడమో చేస్తాం. ఇదీ అటువంటి వార్తే. ఇనుమును దొంగలించడానికి పోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు నలుగురు దొంగలు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాహదోల్ జిల్లాలోని ధన్ పుని పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కల్రీలో మూసి ఉన్న బొగ్గు గనిలో ఉంచిన ఇనుమును దోచుకునేందుకు ఓ దొంగల ముఠా పథకం వేసుకుంది. అక్కడ ఉన్న జంక్ మెషిన్ల నుండి ఇనుము దొంగిలించి క్యాష్ చేసుకుందాం అనుకున్నారు. ప్రణాళిక ప్రకారం ముఠాలోని నలుగురు గనిలోకి ప్రవేశించారు. మరో వ్యక్తిని గని బయట కాపాలాకు పెట్టారు. అయితే నలుగురు వ్యక్తులు చాలా సేపటికి తిరిగి రాకపోవడంతో పాటు ఎటువంటి కదలికలు కానీ, శబ్దాలు కానీ రాకపోవడంతో బయట నిలబడిన వ్యక్తి భయంతో పారిపోయి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సమాచారం అందించాడు.
వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా. సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ (ఎస్ఇసిఎల్) సహాయంతో ఒక రెస్క్యూ టీమ్‌ను గనిలోకి పంపారు. అక్కడ నలుగురు మృతదేహాలను గుర్తించి.. బయటకు తీశారు. వీరంతా గనిలోకి వెళ్లాక ఊపిరాడక చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇలా దొంగతనానికి పోయి నలుగురు ప్రాణాల మీదకు తెచ్చుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.