ఇప్పుడంటే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కానీ.. కొన్నేళ్ల కిందట ఏ సమాచారం కావాలన్నా.. వినోదం పొందాలన్నా రేడియోలు.. అందులో వచ్చే కార్యక్రమాలే దిక్కు. ఆ రోజుల్లో సమాచారం చేరవేయడంలో ఎంతో కీలక పాత్ర పోషించిన రేడియో.. నేడు అంతరించి పోయే స్థితికి చేరుకున్నాయి. ఈ క్రమంలో కనుమరుగవుతున్న రేడియోలను మళ్లీ ప్రజలకు చేరువ చేసేందుకు కేరళలోని ఓ ప్రాంతం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది.
వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కోజికోడ్ జిల్లా కరస్సెరి పంచాయతీ పరిధిలోని అనయంకున్ను గ్రామ ప్రజలంరందరికీ ఉచితంగా రేడియోలను అందించడానికి ఆ పంచాయతీ సభ్యులు సంకల్పించారు. “నా రేడియో” అనే పేరుతో ఆ గ్రామ ప్రజలకు పంచాయతీ అధికారులు రేడియోలు పంపిణీ చేస్తున్నారు. అందులోనూ మొదట వృద్ధులు, అనారోగ్యం పాలైన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అనంతరం ఇంటికి ఒకటి చొప్పున అందించి.. యువతకు రేడియోల పట్ల ఆసక్తి పెంచాలని భావిస్తున్నారు. మొదటి విడతలో భాగంగా.. గ్రామ కమిటీ 30 కుటుంబాలకు రేడియోలను అందిస్తోంది. ఇందుకు అయ్యే సొమ్మును దాతల నుంచి సేకరించి.. ఉచితంగా ఇస్తున్నారు. ఒక్కో రేడియోకు పదిహేను వందల వరకు ఖర్చు అవుతుంది.
అనయంకున్ను గ్రామ కమిటీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నా రేడియో కార్యక్రమం పూర్తయితే.. దేశంలోనే మొదటి పూర్తిస్థాయి రేడియోలు కలిగిన గ్రామంగా చరిత్ర సృష్టించనుంది. సునీత రాజన్ అనే వార్డు సభ్యురాలు ఈ సరికొత్త ఆలోచనకు బీజం వేశారు. మార్చి 26 న “నా రేడియో” కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పది సూత్రాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దీనిని చేపట్టారు. పాత తరం వాటిని మరల కొత్త తరం వారికి పరిచయం చేయాలన ఈ సరికొత్త ఆలోచనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.