Patna Girl Sreeja: పిల్లల ప్రమేయం లేకుండా కనేది తల్లిదండ్రులే కాబట్టి, ఆ పిల్లల పోషణ బాధ్యత కూడా వారిదే. కష్టమైనా, నష్టమైనా వారి కాళ్ళ మీద వారు నిలబడేవరకూ పోషించాల్సిందే. ఈ విషయంలో తండ్రికే ఎక్కువ బాధ్యత ఉండాలి. కానీ తాను కన్న బిడ్డ భారంగా ఉందని వదిలేసిపోయాడో కసాయి తండ్రి. కానీ ఇవాళ ఆ కసాయి తండ్రే సిగ్గుపడే విధంగా ఆ బంగారు తల్లి అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. ఆ బంగారు తల్లి మరెవరో కాదు, బీహార్‌లోని పాట్నాకు చెందిన శ్రీజ.
పసికందుగా ఉన్నప్పుడే శ్రీజ తల్లి అనారోగ్యం కారణంగా చనిపోయింది. తల్లి లేని లోటు తీర్చాల్సిన నాన్నే ఆ పసికందుని అలానే ఇంట్లో ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోయాడు. పెంచే స్థోమత లేదని, ఆడపిల్ల అని నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్ళిపోయాడు. పాపం ఆ పసికందు గుక్కపెట్టి ఏడుస్తుంటే.. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి అమ్మ తరపు బంధువులకు సమాచారం ఇచ్చారు. శ్రీజను, అమ్మమ్మ అక్కున చేర్చుకుంది. తాత, అమ్మమ్మలే పెంచి పెద్ద చేశారు. ఎలాంటి లోటు లేకుండా పెంచారు.
తాజాగా సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో 99.4 శాతం మార్కుల ఉత్తీర్ణత సాధించి గర్వపడేలా చేసింది శ్రీజ. తన మనవరాలు సాధించిన విజయంతో తన అమ్మమ్మ ఎంతగానో మురిసిపోతుంది. ఈ సందర్భంగా మీడియాతో పలు విషయాలు వెల్లడించారు అమ్మమ్మ, మనవరాళ్ళు. శ్రీజ అమ్మమ్మ మాట్లాడుతూ..తన కూతురు చనిపోయాక అల్లుడు శ్రీజను వదిలేసి వెళ్ళిపోయాడని, అప్పటి నుంచి అతన్ని మేము చూడనే లేదని, మరో వివాహం చేసుకున్నట్టు తెలిసిందని వెల్లడించింది. ఇప్పుడు శ్రీజ సాధించిన విజయాన్ని చూసి అతను ఖచ్చితంగా పశ్చాత్తాపం చెందుతాడని అనుకుంటున్నానని ఆమె వెల్లడించింది.
ఇక శ్రీజ తన గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. పుస్తకాల పురుగునని, అలాగని గంటల తరబడి పుస్తకాలకే పరిమితం కానని చెబుతోంది. చదువుతో పాటు ఆటపాటలు, ఇతర పనులకు సమానంగా సమయం కేటాయిస్తానని అంటోంది. పరీక్షకు ముందు పాత ప్రశ్నాపత్రాలను తిరగేయడం, వాటిని సాల్వ్ చేయడం చేసేదాన్నని శ్రీజ చెప్పుకొచ్చింది. డీఏవీ పబ్లిక్ స్కూల్ విద్యార్ధిని అయిన శ్రీజ, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వడం తన డ్రీమ్ అని చెప్పుకొచ్చింది. ఈ చిన్నారి సాధించిన విజయానికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదువుల తల్లికి, చదువుల తల్లి విజయానికి కారణమైన అమ్మమ్మకి హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు.
మరోవైపు శ్రీజ సక్సెస్‌పై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ స్పందించారు. “త్యాగానికి, అంకితభావానికి నిదర్శనంగా నిలిచే అద్భుతమైన కథ. తండ్రి వదిలేసి వెళ్ళిపోతే అమ్మమ్మ దగ్గర ఉంటూ కష్టపడి చదివి చరిత్ర సృష్టించిన కూతురు. పదవ తరగతిలో 99.4 శాతం ఉత్తీర్ణత సాధించి.. ప్రతిభకు అవకాశాల కోసం వెతికే పనిలేదని నిరూపించింది. నేను నీకు ఉపయోగపడగలిగితే నేను అదృష్టవంతుడినే” అంటూ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు.
అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు, జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు అని ఖలేజా డైలాగ్‌ని శ్రీజ గుర్తు చేసింది. తన ఖలేజా ఏంటో ఆ కసాయి తండ్రికి చూపించింది. టీవీలోనో, సెల్ ఫోన్‌లోనో కూతురి విజయం చూసి చేసిన తప్పుకి పశ్చాత్తాప్పడకుండా ఉంటాడా? ఆడపిల్ల అంటేనే అద్భుతం. ఆ విషయం తెలియక శ్రీజ తండ్రి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శ్రీజ అద్భుతాన్ని ఆ తండ్రి గుర్తించాల్సిన అవసరం లేదు. మరి ఆడబిడ్డ అని, పెంచడం భారమని వదిలేసి పోయిన కసాయి తండ్రిపై, తండ్రికి కనువిప్పు కలిగేలా విజయం సాధించిన శ్రీజపై, మనవరాలి విజయానికి కారణమైన అమ్మమ్మపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
त्याग और समर्पण की अद्भुत दास्ताँ!
माँ का साया हटने पर पिता ने जिस बेटी का साथ छोड़ दिया उसने नाना-नानी के घर परिश्रम की पराकाष्ठा कर इतिहास रच दिया।
बिटिया का 10वी में 99.4% अंक लाना बताता है कि प्रतिभा अवसरों की मोहताज नहीं है।
मैं आपके किसी भी काम आ सकूँ, मेरा सौभाग्य होगा। pic.twitter.com/ufc3Gp4At9
— Varun Gandhi (@varungandhi80) July 24, 2022