దేశంలో మోటారు వాహన చట్టం ప్రకారం ప్రతి వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందులో ప్రైవేట్ వెహికల్, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అనే విధానాలు ఉండేవి. గతేడాది BH సిరీస్ తో మరో రిజిస్ట్రేషన్ విధానాన్ని కేంద్రం ప్రేవేశ పెట్టింది. అసలు ఆ సిరీస్ ప్రత్యేకత ఏంటి? దానికి ఎవరు అర్హులు? ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే అంశాలు తెలుసుకుందాం.
పాత రిజిస్ట్రేషన్ విధానం ప్రకారం మొదట ఆ స్టేట్ పేరు, ఆ తర్వాత ఆర్టీవో సీరియల్, ఆ తర్వాత నంబర్ ఉంటుంది. బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ ను గమనిస్తే దానిలో మొదట సవంవత్సరం ఉంటుంది. ఆ తర్వాత బీహెచ్ అని ఆ తర్వాత అంకెలు ఉంటాయి. ఈ సిరీస్ ప్రత్యేక ఏంటంటే.. సాధారణంగా విధుల్లో భాగంగా ట్రాన్స్ ఫర్ జరిగితే వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అలా వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు మళ్లీ మీరు మీ వాహనాన్ని ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా చేయించు కోవాలంటే మీరు పాత ఆర్టీవో నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకువెళ్లాలి. ప్రో రాటా పద్ధతిలో కొత్త రాష్ట్రంలో మళ్లీ రోడ్డు ట్యాక్స్ కట్టాలి.
అలా మీకు ఎన్ని స్టేట్స్ మారితే అన్నిసార్లు మీరు ఇదే విధానాన్ని అవలంభించాలి. బీహెచ్ రిజిస్ట్రేషన్ తో ఆ తలనొప్పులు తగ్గిపోతాయి. దీని ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏ ప్రైవేటు వాహనం అయినా ప్రాంతం మారినప్పుడు రీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్‌ఓసీ అక్కర్లేదు. నేరుగా వాహనదారుడే రీ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా ప్రజలకు వారి సమయం, డబ్బు రెండూ సేవ్ అవుతాయి.
ఈ రిజిస్ట్రేషన్ విధానం ఆగస్టు 28, 2021న ప్రతిపాదన చేయగా.. సెప్టెంబర్ 15, 2021 నుంచి అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ విధానంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. గతంలో వాహనానికి రోడ్ ట్యాక్స్ 15 సంవత్సరాలకి కలిపి లైఫ్ ట్యాక్స్ కట్టే సదుపాయం ఉండేది. కానీ, బీహెచ్ విధానంలో మాత్రం రెండేళ్ల కొకసారి ఆ స్టేట్ విధానాల ప్రకారం రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ రిజిస్ట్రేషన్ విధానానికి అర్హులు. ప్రైవేటు ఉద్యోగులు అయితే వారి కంపెనీ నాలుగు లేదా ఐదు రాష్ట్రాల్లో లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉండి ఉండాలి. అలాంటి వారు ఈ రిజిస్ట్రేషన్ విధానానికి అర్హులు.
ప్రస్తుతం మీరు ఉండే పరిధికి సంబంధించిన ఆర్టీవో కార్యాలయంలో లేదా వాహన్ పోర్టల్ లో ఈ బీహెచ్ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. అందుకు మొదట మీరు ప్రభుత్వ సంస్థ ఉద్యోగి అని తెలిపేలా మీ గుర్తింపు కార్డును ఇవ్వాలి. ఆ తర్వాత ఆ స్టేట్ విధానం ప్రకారం రెండేళ్లకు రోడ్ ట్యాక్స్ కట్టాలి.