2022 సంవత్సరం దాదాపుగా ముగిసిపోయింది. అంతా ఇప్పటి నుంచే కొత్త సంవత్సరం మూడ్ లోకి వెళ్లిపోయారు. 2023 ఏడాది కోసం ఎదురుచూపులు స్టార్ట్ చేశారు. అయితే సెలబ్రేషన్స్ కోసం కొత్త సంవత్సరం రావాలని కోరుకుంటున్నారు. కానీ, జనవరి నుంచి ఆర్థికంగా, వాణిజ్యపరంగా చాలా మార్పులు రాబోతున్నాయి. ఆ విషయాలను తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోవడం మంచిది. లేదంటే మీ జేబుకు చిల్లు పడే అవకాశాలు చాలా ఉన్నాయి. క్రెడిట్ కార్డులు కూడా కొత్త నిబంధనలను తీసుకురాానున్నట్లు తెలుస్తోంది. అలాగే వాణిజ్య పరంగానూ భారీ మార్పులు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
బ్యాంకింగ్ పరంగా పెద్దగా మార్పులు ఉన్నట్లు తెలియడంలేదు. కానీ, జనవరి కావడంతో బ్యాంకులకు బాగా సెలవులు ఉంటాయని తెలిసిందే. సంక్రాంతి పండగని దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటారు. వివిధ పేర్లతో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి ఈ నెలలో ఆదివారాలు, రెండో శనివారాలు, సంక్రాంతి సెలవులు ఇలా అన్నీ కలుపుకుని చాలారోజులు బ్యాంకులు మూతబడే ఉంటాయి. కాబట్టి ఎమర్జెన్సీ పనులు ఉంటే త్వరగా పూర్తి చేసుకోండి.
క్రెడిట్ కార్డుల వినియోగం ఇప్పుడు బాగా పెరిగిపోయింది. బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డుల జారీని బాగా సులభతరం చేసింది. అయితే క్రెడిట్ కార్డులు వాడే వారికి రివార్డ్ పాయింట్లు వస్తాయన్న సంగతి తెలిసిందే. మీరు చేసే షాపింగ్, లావాదేవీలపై బ్యాంకులు మీకు రివార్డ్ పాయింట్లు ఇస్తాయి. అయితే వచ్చే ఏడాది నుంచి ఈ రివార్డు పాయింట్లకు సంబంధించి నిబంధనలు కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. కాబట్టి మీ ఖాతాలో ఉన్న పాయింట్లను ఇప్పుడు వినియోగించుకోవడం మంచిదంటూ నిపుణులు సూచిస్తున్నారు.
వచ్చే ఏడాది నుంచి అధికారులు వాహన చట్టాల నిబంధనలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశిస్తున్నారు. జనవరి నుంచి అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు ఉండాల్సిందేనని.. లేనిపక్షంలో రూ.5 వేల వరకు జరిమానా కూడా విధిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే ఈ విషయంలో చర్యలు తీసుకుంటున్న ట్రాఫిక్, రవాణా శాఖ అధికారులు జనవరి నుంచి మరింత పకడ్బందీగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.
రూ.5 కోట్లకుపైగా వ్యాపారం నిర్వహించే వారికి ఇక నుంచి ఇ- ఇన్ వాయిసింగ్ తప్పనిసరి చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 1, 2023 నుంచి వీళ్లు తప్పనిసరిగా ఇ- బిల్ జనరేట్ చేయాలి. గతంలో ఇది రూ.20 కోట్లు దాటిన వ్యాపారులు జనరేట్ చేసేవాళ్లు.
ప్రస్తుతం అందరూ ఆరోగ్య, వాహన బీమాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వాహనాల వినియోగం, మెయిన్టినెన్స్ ఆధారంగా ప్రీమియం పెంచేందుకు ఐఆర్ డీఏఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మీరు చెల్లించే ప్రిమియాలు మరింత ప్రియం కానున్నాయి. కాబట్టి ఈ ఏడాది ముంగింపులోపే మీ బీమా విషయాల్లో ఓ నిర్ణయం తీసుకోవడం మంచిది.
ఇప్పుడు దాదాపుగా అన్ని ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డును తప్పనిసరి చేస్తున్నారు. అలాగే ఆధార్- పాన్ కార్డు అనుసంధానం చేయాలనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలాసార్పు ఈ గడువును పెంచుతూ వచ్చిన కేంద్రం.. ఇంక మార్చి 31, 2023 వరకు చివరి అవకాశం కల్పించింది. ఆ తర్వాత మీ పాన్ కార్డు పనిచేయదని తేల్చేసింది. ప్రస్తుతం రూ.1000 జరిమానాతో పాన్- ఆధార్ అనుసంధానం చేయాల్సి ఉందన్న విషయం తెలిసిందే.