ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. మహిళల కోసమే ప్రత్యేకమైన పథకాలు మ్యానిఫెస్టోలో పొందుపరుస్తున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగానే ఓ పార్టీ మహిళలకు పెద్ద పీట వేస్తూ మ్యానిఫెస్టోను రూపొందించింది. అందులో పలు హామీలను గుప్పించింది. ఇంతకు ఆ పార్టీ ఏంటంటే..?
దేశంలో పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అటు సార్వత్రిక ఎన్నికలకు కూడా సమయం దగ్గర పడింది. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. మహిళల్ని పొగడ్తలతో ముంచెత్తుతుంటారు మన నాయకులు. మహిళా ఓట్లే లక్ష్యంగా ఎన్నికల తాయితాలను సిద్ధం చేస్తున్నాయి పార్టీలు. తాము అధికారంలోకి వస్తే ఇదీ చేస్తాం, అదీ చేస్తాం అంటూ పలు పథకాలను రచించేస్తున్నాయి. మహిళల కోసమే ప్రత్యేకమైన హామీలను ఇస్తుంటాయి. ఈ ఎన్నికల్లో భాగంగానే ఓ పార్టీ మహిళలకు పెద్ద పీట వేస్తూ మ్యానిఫెస్టోను రూపొందించింది. ఇంతకు ఆ రాష్ట్రం, ఆ పార్టీ ఏదంటే..?
కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార బీజెపీతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు చాలా కీలకం. అయితే మరో పార్టీ జనతాదళ్ సెక్యులర్ (జెడిఎస్)కు ప్రతిష్టాత్మకం. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగుతోన్న ఈ పార్టీ.. తాజాగా మ్యానిఫెస్టోను రూపొందించింది. 12 హామీలతో కూడిన పార్టీ మేనిఫెస్టోను పద్మనాభనగరలోని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ తన నివాసంలో విడుదల చేశారు. అందులో మహిళలకు కోసం పలు పథకాలను జెడి(ఎస్) రూపొందించింది. ప్రతి సంవత్సరం మహిళలకు ఉచితంగా ఐదు ఎల్‌పిజి సిలిండర్లు, స్త్రీ శక్తి రుణాల మాఫీ, ప్రైవేట్ ఉద్యోగాల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు, ప్రధాన వ్యాధుల చికిత్సకు రూ. 25 లక్షల వరకు గ్రాంట్లు వంటి 12 వాగ్దానాలను జెడి(ఎస్) శనివారం ముందుంచింది.
రైతులకు ప్రతి ఎకరా కు రూ.10 వేలు ధన సహాయం, గర్భిణీలకు 6 నెలలపాటు రూ.6 వేలు భత్యం, వితంతు పింఛన్ రూ.900 నుంచి రూ.2500 లకు పెంపు, మైనారిటీల ప్రగతి, ఎస్సీ, ఎస్టీలకు మరింత ప్రోత్సాహకాలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు రూ.5 వేలు వేతనం, అలాగే కనీసం 15 ఏళ్లు సర్వీసుతో రిటైరైన వారికి పెన్షన్ వసతి కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారు. వృద్ధులకు నెలవారి పింఛన్ రూ.1500 నుంచి రూ.5 వేలకు పెంచుతామని తెలిపారు. వ్యవసాయ కార్మిక కుటుంబానికి రూ.2 వేలు సహాయ ధనం, రైతు యువకులను పెళ్లాడే యువతులకు రూ.2 లక్షలు ప్రోత్సాహక ధనం, . ఈ కార్యక్రమంలో హెచ్ డీ కుమారస్వామి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.