రెండు దశాబ్దాల ప్రస్థానంతో సాగుతున్న గులాబీ పార్టీ మరో మైలు రాయిని చేరడానికి సిద్ధం అవుతోంది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో జన ప్రభంజనమై గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాలకులను వణికించిన చరిత్ర టీఆర్ఎస్‌ది. ‘తెలుగు రాష్ట్రాల నుంచి తొలిసారిగా ఒక ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో పార్టీ కార్యాలయం’ ఏర్పాటు చేస్తున్నారు. 2020 అక్టోబర్ 9న 11 వందల చదరపు మీటర్ల భూమిని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి కేంద్రం కేటాయించింది. పార్టీ ఆఫీస్ భూమి కోసం టీఆర్‌ఎస్ 8 కోట్ల రూపాయలను కేంద్రానికి చెల్లించింది. వసంత్ విహార్‌లో ఏర్పాటు చేయనున్న టీఆర్‌ఎస్ భవన్ పార్టీ కార్యాలయానికి సీఎం కేసీఆర్ గురువారం భూమిపూజ నిర్వహించారు. 1100 గజాల స్థలంలో టీఆర్‌ఎస్ ఆఫీస్ నిర్మాణం జరగనుంది. ఈ సందర్భంగా కేసీఆర్ వసంత్ విహార్‌లో టీఆర్‌ఎస్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతోపాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఢిల్లీలో సొంత కార్యాలయ భవనం నిర్మించుకుంటున్న అతికొన్ని ప్రాంతీయ పార్టీల జాబితాలో టీఆర్‌ఎస్ చేరుతోంది. వచ్చే ఏడాది దసరాలోగా భవన నిర్మాణాన్ని పూర్తి చేసి పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల అధినేతలను ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలనే యోచ నలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 40 కోట్ల అంచనా వ్యయంతో పార్టీ భవన్‌ను నిర్మిస్తున్నారు. మీటింగ్ హాల్‌తోపాటు రాష్ట్రం నుంచి వివిధ పనుల మీద వచ్చేవారు బస చేసేందుకు అన్ని సౌకర్యాలు ఉండేలా భవన నిర్మాణానికి డిజైన్ చేశారు. ఢిల్లీలో నిర్మాణం చేయబోయే కార్యాలయ భవనం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ను పోలి ఉంటుందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.
ఏడాదిలోపే నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆఫీస్ నిర్మాణం పూర్తయితే ఢిల్లీలో శాశ్వత కార్యాలయమున్న వన్ అండ్ ఓన్లీ పార్టీగా టీఆర్ఎస్ అవతరించనుంది