కరోనా కష్టకాలం తర్వాత నిత్యాసర సరుకుల ధరలు పెరిగిపోతూ సామాన్యులకు పెను భారంగా మారుతున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ అమాంతం పెరిగిపోయాయి. ఇక వంట గ్యాస్ ధర ఏకంగా వెయ్యి దాటిపోయింది. మార్కెట్ కి వెళ్లి ఏ వస్తువు కొనాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది.
దేశంలో కొంత కాలంగా నిత్యవసర సరుకుల ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. రేండేళ్ల పాటు కరోనా కష్టకాలంలో ప్రజలు అల్లాడిపోతుంటే.. అనునిత్యం పెరిగిపోతున్న నిత్యావసర ధరలు వారిపై మరింత భారం అవుతున్నాయి. ఇప్పటికే పెట్రోల, డీజిల్, వంటనూనె, గ్యాస్ ధరలు పెరిగి సామాన్యుడికి మోయలేని భారంగా మారాయి. ఇలాంటి సమయంలో సగం ధరకే గ్యాస్ సిలిండర్ అంటూ ఓ నేత హామీ ఇచ్చారు. ఇంతకీ ఆ నేత ఎవరు.. ఎక్కడ? అన్న వివరాల్లోకి వెళితే..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ప్రధాన పార్టీల నేతలు ప్రచారాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమార స్వామి ఓటర్లకు హామీల వర్షం కురిపించారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే 5 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని.. 10 సిలిండర్లు సగం ధరకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉజ్వల పథకం కింద ఉచితంగా వంట గ్యాస్ ఇస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు మహిళలకు షాక్ ఇస్తూ అడ్డగోలుగా ధరలు పెంచిందని విమర్శించారు. ప్రస్తుతం ఒక సిలిండర్ ధర రూ.1100 లకు చేరిందని ఎద్దేవా చేశారు.
అసలే నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్న సమయంలో గ్యాస్ ధరలు సామాన్యులకు పెను భారంగా మారిందని.. అందుకే తమ పార్టీ అధికారంలోకి వస్తే సగానికే గ్యాస్ అందిస్తామని అన్నారు. ఇక ఆటో డ్రైవర్లకు నెలకు రూ.2 వేలు అందజేస్తామని అన్నారు.. అంతేకాదు గత కొంత కాలంగా తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయమని కోరుతున్న అంగన్ వాడీ వర్కర్ల కోరికను కూడా తీరుస్తామని కుమార్ స్వామి హామీ ఇచ్చారు. తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో తొలిసారిగా ఓట్ ఫ్రమ్ హోమ్ విధానం ప్రవేశపెట్టనున్నారు.