ప్రపంచం చాలా చిన్నదైపోయింది. అందులో ప్రేమ ఇంకా చిన్నదైపోయింది. ప్రేమ హద్దులు, సరిహద్దులు, దేశాలు, ఖండాతరాలు దాటి ప్రయాణం చేస్తుంది. ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుందో చెప్పలేము. అయితే ప్రేమ అంటే ప్రేమించడం మాత్రమే కాదు, పిల్లల్ని ఎంతగానో ప్రేమించే పెద్దలను ఒప్పించడం కూడా. కానీ ఇప్పుడున్న నిబ్బా, నిబ్బీలు ఈ ప్రేమకున్న డెఫినిషన్ మార్చేశారు. ప్రేమ అంటే రెండు మనసులు, రెండు తనువులు కలిస్తే సరిపోతుంది అనుకునే నిబ్బా, నిబ్బీ బ్యాచ్ ఉన్న ఈ సమాజంలో ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుందో జంట. ఇంటర్మీడియట్ నిబ్బీలు ఆటోవాళ్ళతో లేచిపోతున్నారని ఆ మధ్య నెగిటివ్ టాక్ బాగా నడిచేది. దీని మీద ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ దీనికి విరుద్ధంగా తమ కూతుర్ని.. భారతీయ ఆటోడ్రైవర్ కిచ్చి పెళ్లి చేసిందో విదేశీ కుటుంబం.
బెల్జియంకి చెందిన కెమిల్ అనే యువతి.. కర్ణాటకకు చెందిన ఆటోడ్రైవర్ అనంతరాజుని వివాహం చేసుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హంపిలోని విరూపాక్షేశ్వరుడి సన్నిధిలో ఇవాళ ఉదయం 9.25 గంటలకు ఈ జంట ఒకటయ్యింది. కుటుంబ సభ్యులు, బంధు, మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. అంజీనప్ప కొడుకు అనంతరాజు హంపిలోని జనతా ప్లాట్ లో ఉంటున్నారు. ఆటోడ్రైవర్ గా జీవనం సాగిస్తున్నారు. అయితే కెమిల్ బెల్జియంకు చెందిన సామాజిక కార్యకర్త. నాలుగైదేళ్ల క్రితం ఆమె హంపి వచ్చారు. ఆ సమయంలోనే వీరికి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అనంతరాజు నిజాయితీ నచ్చడంతో మూడేళ్ళ క్రితమే వివాహం చేయాలనుకున్నారు కెమిల్ కుటుంబ సభ్యులు.
అయితే కరోనా కారణంగా వీరి పెళ్లి పోస్ట్ పోన్ అయ్యింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకటయ్యారు. అయితే తమ దేశంలో గ్రాండ్ గా పెళ్లి చేయాలని అనుకున్న కెమిల్ కుటుంబ సభ్యులు.. ఆ తర్వాత హంపిలో చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో హిందూ సాంప్రదాయం పధ్ధతిలో వీరి వివాహం జరిపించారు. గతంలో కూడా చాలా మంది విదేశీయులు హంపి స్థానికులని పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. వీరిలానే ఇప్పుడు ఈ కెమిల్ అనే విదేశీ యువతి.. కర్ణాటకకు చెందిన యువకుడ్ని వివాహం చేసుకున్నారు. అయితే సామాజిక కార్యకర్త అయి ఉండి.. ఆటోడ్రైవర్ ను వివాహం చేసుకోవడంపై ఆమెను నెటిజన్లు అభినందిస్తున్నారు. ప్రస్తుతం వీరి వివాహ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.