అది పేదలు నివసించే ప్రాంతం. పొట్ట చేతపట్టుకుని.. ఉపాధి కోసం ఉన్న ఊరిని, అయినవారిని వదులుకుని దూరంగా వచ్చారు. గుడిసెలు ఏర్పాటు చేసుకుని.. కష్టం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారిపై విధి పగపట్టింది. అగ్నిప్రమాదం రూపంలో మృత్యువు వారిని కబలించింది. ఈ విషాద సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు సజీవదహనం కాగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 60 గుడిసెలు దహనం అయ్యాయి. ఢిల్లీలోని గోకుల్‌పురి ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మొత్తం 13 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనా స్థలంలో ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన సినిమా ధియేటర్
ఈశాన్య ఢిల్లీ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవాన్ష్ కుమార్ మహ్లా మాట్లాడుతూ..‘‘శుక్రవారం అర్ధరాత్రి 1 గంట తర్వాత గోకుల్‌పురి పీఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది.. వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు.. అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు కూడా వేగంగా స్పందించారు.. మూడు గంటల పాటు శ్రమించి శనివారం తెల్లవారుజాము 4 గంటలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చాం’’ అని చెప్పారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.