కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఏడాదికి పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేశారు. ఆ సమయంలో దేశం మొత్తం రైతులకు మద్దతుగా నిలబడింది. దీంతో రైతు ఉద్యమానికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆ మూడు సాగు చట్టాలను బేషరతుగా రద్దు చేసింది. అది రైతుల విజయంగా కీర్తించబడింది.
ప్రధాని మోదీ రైతులకు, యావత్ దేశానికి క్షమాపణ చెప్పిమరీ సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించారు. అయినా కూడా రైతులు ఆయన మాటను నమ్మలేదు. పార్లమెంట్‌లో రద్దు బిల్లు పాస్ అయి.. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతనే తమ నిరసనను విరమించారు. ఎండా, వానా, చలి, కరోనా లాంటి వాటిని తట్టుకుని గొప్ప ఉద్యమాన్ని క్రమశిక్షణతో నడిపిన రైతులు.. మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో పంజాబ్ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా.. తామే బరిలో ఉంటామని 20కి పైగా రైతు సంఘాలు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం.
22 farm organisations in Punjab that were part of protest against Centre’s three farm laws form political front, announce they would contest upcoming state assembly polls
— Press Trust of India (@PTI_News) December 25, 2021
ఈ 20 రైతు సంఘాలు సాగు చట్టాల రద్దు ఉద్యమంలో కీలక పాత్ర పోషించాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే రైతు సంఘాల నిర్ణయంతో బీజేపీ పంజాబ్ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సాగు చట్టాలతో బీజేపీపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. నిత్యావసరాల ధరల పెంపు, పెట్రోల, డీజిల్ రేట్ల పెంపు.. ప్రభుత్వ ఆస్తుల అమ్మకంతో బీజేపీని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఇప్పుడు రైతుల ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటే తమకు తీవ్ర నష్టం జరుగుతుందని బీజేపీ పంజాబ్‌నేతలు ఢిల్లీ పెద్దల వద్ద గోడు వెల్లబోసుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి రైతులు ఎన్నికల్లో పోటీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.