రైతు వ్యవసాయం తప్ప ఏమీ తెలియదు. కలెక్టర్ అవ్వాలని కలలు కన్నాడు. కానీ ఆ కలలు కలలుగానే మిగిలిపోయాయి. అయితే ఆ రైతు కలను కూతుర్లు నెరవేర్చారు. ఒక కూతురు కాదు, ఐదుగురు కూతుర్లూ కలెక్టర్లు అయ్యి చూపించారు.
అమ్మాయిలు ఇంట్లో ఉండాలని, పిల్లలని చూసుకోవాలని, మగాడు సంపాదించాలని వంటి నియమాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు మగవారితో పాటు సమానంగా ఆడవారు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. రాజకీయాల్లో, సినిమాల్లో, ఉద్యోగం, వ్యాపారం ఇలా అనేక రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. అయితే రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతాల్లో ఇంకా ఆడవారి పట్ల వివక్ష ఉంది. ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తారు. భ్రూణహత్యలకు మారుపేరుగా మారిన రాష్ట్రంలో ఒక రైతు ఏకంగా ఐదుగురు ఆడబిడ్డలకు జీవితాన్ని ఇచ్చాడు. అంతేనా వారిని కష్టపడి చదివించి కలెక్టర్లను చేశాడు. ఆడపిల్ల పుట్టిందా అని వెక్కిరించే సమాజంలో ఆడపిల్లలు ఈ లోకంలోకి వస్తున్నారని తెలిసి వారికి ప్రాణం పోశాడు. ఒక ఆడపిల్ల పుడితేనే అయిపోయిందిరా వీడి పని, వీడంత దురదృష్టవంతుడు మరొకడు ఉండడు అని వెక్కిరించే సమాజంలో ఐదుగురు ఆడపిల్లలను కలెక్టర్లను చేసి అదృష్టవంతుడు అనిపించుకున్నాడు.
రాజస్థాన్ కి చెందిన ఒక రైతుకు పుట్టిన ఐదుగురు ఆడబిడ్డలు కలెక్టర్లు అయ్యారు. ఈ ఐదుగురు మహిళా కలెక్టర్లు ఇవాళా యువతకు ఆదర్శంగా నిలిచారు. ఒక కుటుంబంలో ఒక కలెక్టర్ ఉంటేనే పండగలా ఉంటుంది. అటువంటిది ఒకే ఇంట్లో ఐదుగురు కలెక్టర్లు ఉంటే ఇంకేమైనా ఉందా? రాజస్థాన్ లోని హనుమాన్ ఘర్ జిల్లాలోని భేరుసరి అనే మారుమూల గ్రామానికి చెందిన సహదేవ్ సహరన్, లక్ష్మి దంపతులకు ఐదుగురు కూతుర్లు ఉన్నారు. వారి పేర్లు రోమా, మంజు, అన్షు, రీతూ, సుమన్. వీరి తల్లి లక్ష్మి చదువుకోలేదు. తండ్రి సహదేవ్ ఒక రైతు. వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. ఆ ప్రాంతంలో నీటి సమస్య ఉంది. వ్యవసాయం చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. దిగుబడి కూడా పెద్దగా ఏమీ ఉండదు. దీంతో తన కూతుర్లను చదివించే స్థోమత కూడా లేదు. పిల్లలను పాఠశాలకు పంపించలేక ఇంటి దగ్గరే చదువుకోమని పిల్లలకు చెప్పాడు.
అయితే రైతుకు కలెక్టర్ అవ్వాలన్న కోరిక ఉండేది. కానీ అది నిజం కాలేదు. అయితే తన పిల్లలు చదువుకుని కలెక్టర్లు అయ్యి తన కోరిక నెరవేర్చాలని రైతు తన కూతుర్లను కోరాడు. అలా రైతు కూతుర్లు కష్టపడి చదివారు. 2010లో రోమా అనే ఆడబిడ్డ ఆ ఇంటి నుంచి మొదటి కలెక్టర్ అయ్యింది. ఆ తర్వాత 207లో మంజు సివిల్స్ పరీక్షలో పాస్ అయ్యింది. కలెక్టర్ అయ్యింది. ఈ ఇద్దరు అక్కలను ఆదర్శంగా తీసుకుని అన్షు, రీతూ, సుమన్ లు కూడా కలెక్టర్లు అవ్వాలని ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. వీరు కూడా సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ముగ్గురూ ఏకకాలంలో రాజస్థాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కి ఎంపికై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు. పట్టుదల, కృషితో ఐదుగురు అక్కాచెల్లెళ్లు రాజస్థాన్ లోని కలెక్టర్లుగా పని చేస్తున్నారు. తండ్రి కష్టాన్ని, కలను అర్థం చేసుకున్న కూతుర్లుగా ఐదుగురు అక్కాచెల్లెళ్లు కొనియాడబడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఐదుగురు ఆడపిల్లలను మెచ్చుకుంటున్నారు. మరి బడికి వెళ్ళడానికి కూడా ఆర్థిక స్థోమత లేనటువంటి రైతు కుటుంబంలో పుట్టి.. ఇవాళ కలెక్టర్లుగా ఎదిగిన ఐదుగురు అక్కాచెల్లెళ్లపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.