ద్విచక్ర వాహనాల కొనుగోలు చేసే సామాన్యులపై భారం తగ్గనుందా? ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ తగ్గనుందా?
ద్విచక్ర వాహనాలపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీలో కొంత మేర తగ్గించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. లక్షలాది మందికి అవసరమైన ఈ ఆటోమొబైల్ విభాగాన్ని లగ్జరీ వస్తువుగా వర్గీకరించకూడదని తెలిపింది. ఆర్థిక మంత్రి, జీఎస్టీ కౌన్సిల్ ఛైర్మన్ నిర్మలా సీతారామన్, జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు, ఆటోమొబైల్ రంగాన్ని పర్యవేక్షిస్తున్న భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖకు ఎఫ్ఏడీఏ విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. గత కొన్నేళ్లుగా ద్విచక్రవాహనాల విక్రయాల్లో గణనీయమైన తిరోగమనాన్ని చవి చూసిన ద్విచక్ర వాహన పరిశ్రమను గాడిలో పెట్టేందుకు ఈ నిర్ణయం సహాయపడుతుందని వివరించింది.
ద్విచక్రవాహనాలు సరసమైనవిగా చేయడంతో పాటు డిమాండ్ ను పునరుద్ధరించడంలో ఈ నిర్ణయం తోడ్పడుతుందని ఎఫ్ఏడీఏ పేర్కొంది. ద్విచక్ర వాహన పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కఠిన ఉద్గార నిబంధనలు, కోవిడ్-19 అనంతర ప్రభావాలు వంటి సవాళ్లతో ద్విచక్ర వాహన పరిశ్రమ పోరాడుతోందని.. క్లిష్ట దశలో ఉందని ఎఫ్ఏడీఏ తెలిపింది. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేటుని తగ్గించి సామాన్యులకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు జీఎస్టీ కౌన్సిల్ కి ఇదే సరైన సమయం అని పేర్కొంది. పన్ను తగ్గించడం వల్ల ద్విచక్ర వాహన పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహం అందుతుందని.. ఉపాధి అవకాశాలను సృష్టించడంలోనూ, అలానే దేశ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంతో సహాయపడుతుందని ఎఫ్ఏడీఏ తెలిపింది.
అధిక జనాభా తక్కువ ఖర్చుతో ప్రయాణాలు చేసే విషయంలో ద్విచక్ర వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని, ముఖ్యంగా ప్రజా రవాణా తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు ఈ వాహనాలు విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంది. కొన్నేళ్లుగా ద్విచక్ర వాహనాల ధరలు గణనీయంగా పెరగడంతో వినియోగదారుల కొనుగోలు శక్తిపై ప్రభావం చూపుతుందని తెలిపింది. కఠినమైన ఉద్గార నిబంధనలు, ముడి పదార్థాల ధరలు పెరగడం, అధిక పన్నులు, రుసుములు సహా అనేక కారణాలు పెరుగుదలకు కారణమవుతుందని ఎఫ్ఏడీఏ పేర్కొంది. 2016లో హోండా యాక్టివా ధర రూ. 52 వేలు ఉంటే.. అది 2023లో రూ. 88 వేలకు చేరిందని.. అలానే 2016లో బజాజ్ పల్సర్ ధర రూ. 72 వేలు ఉంటే.. ఇప్పుడు రూ. లక్షన్నరకు పెరిగిందని తెలిపింది.
ద్విచక్ర వాహనాల ధరల్లో నిరంతర పెరుగుదల కారణంగా అమ్మకాలు క్షీణించాయని ఎఫ్ఏడీఏ తెలిపింది. ద్విచక్ర వాహన పరిశ్రమ వృద్ధి పథాన్ని పునరుద్ధరించడానికి జీఎస్టీ కౌన్సిల్ జోక్యం అవసరమని పేర్కొంది. 2016లో మన దేశంలో జరిగిన ఆటోమొబైల్ విక్రయాల్లో ద్విచక్ర వాహనాల వాటా 78 శాతం ఉంటే.. 2022-23లో 72 శాతానికి పడిపోయిందని తెలిపింది. దీనికి 2020 నుండి నిరంతర ధరల పెరుగుదలే కారణమని ఎఫ్ఏడీఏ తెలిపింది. జీఎస్టీని తగ్గిస్తే ఇతర రవాణా ద్విచక్ర వాహనాల పోటీ పెరుగుతుందని.. తద్వారా పరిశ్రమకు అమ్మకాలతో పాటు ఆదాయం పెరుగుతుందని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ మనీష్ సింఘానియా జీఎస్టీ కౌన్సిల్ కు వివరించారు.
మరి దీనిపై జీఎస్టీ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ ఎఫ్ఏడీఏ కోరినట్లు 28 శాతం ఉన్న జీఎస్టీని 18 శాతానికి తగ్గిస్తే కనుక.. లక్ష విలువ చేసే బైక్ మీద రూ. 10 వేలు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం లక్ష రూపాయల బైక్ పై 28 శాతం జీఎస్టీ అంటే రూ. 28 వేలు ఉంది. 18 శాతానికి తగ్గిస్తే లక్ష మీద రూ. 18 వేలు తగ్గే అవకాశం ఉంటుంది. మరి కేంద్రం ద్విచక్ర వాహనాలపై జీఎస్టీని తగ్గిస్తుందా? లేదా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.