. శివకాశి పరిసర ప్రాంతాల్లో ఉన్న బాణా సంచా ఫ్యాక్టరీల్లో ఒక్కొక్కసారి పేలుళ్లు జరుగుతుంటాయి. కూలీలుగా వచ్చిన వారు.. ఈ ప్రమాదకర ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది.
తమిళనాడులోని శివకాశి.. ఆ పరిసర ప్రాంతాలు బాణా సంచా ఫ్యాక్టరీలకు నెలవు. ఇక్కడ తయారు చేసే బాణా సంచాలను దేశ వ్యాప్తంగా సరఫరా అవుతూ ఉంటాయి. అయితే ఈ తయారీ సమయంలో చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. శివకాశి పరిసర ప్రాంతాల్లో ఉన్న బాణా సంచా ఫ్యాక్టరీల్లో ఊహించని రీతిలో పేలుళ్లు జరుగుతుంటాయి. కూలీలుగా వచ్చిన వారు.. ఈ ప్రమాదకర ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కాంచీపురం జిల్లాలోని బాణా సంచా ఫ్యాక్టరీలో పేలిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన మర్చిపోక ముందే ఇప్పుడు మరో చోట పేలుళ్లు సంభవించాయి. విరుధ్ నగర్ జిల్లాలో పేలుళ్లు సంభవించాయి.
శివకాశికి సమీపంలోని విరుధ్ నగర్ జిల్లా విల్లంపట్టిలోని పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఓ ప్రైవేట్ బాణా సంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీగా పేలుళ్లు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. 30కి పైగా గదులున్న ఈ ఫ్యాక్టరీలో సుమారు 50 మంది పనిచేస్తున్నారు. ఒక్క సారిగా పేలడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుప్రతికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీలకు మంటలు వ్యాపించకుండా, ప్రమాద స్థలికి ఎవరూ వెళ్లకుండా రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శిథిలాలలో చిక్కుకుని మరెవరైనా చనిపోయి ఉంటారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.