జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నంబర్ 1 సినిమా గుర్తింది కదా. అందులో అందరికి నచ్చే సీన్ ఒకటుంది. ఓ యువతికి సాయం చేయబోయి.. అనుకోకుండా ఓ వ్యక్తి హత్యకు కారణమై, జైలు పాలవుతాడు మన జూ.ఎన్టీఆర్. అయితే తండ్రి కోరికను నెరవేర్చేందుకు జైలు నుండి న్యాయ విద్యను అభ్యసించి..బంగారు పతకాన్ని సాధిస్తాడు. ఇది సినిమా అండి.. నిజ జీవితంలో సాధ్యమయ్యే పనేనా అనుకుంటున్నారా.. సాధ్యమే అని నిరూపించాడూ ఈ అస్సాం కుర్రాడు.
ఆ స్టూడెంట్ పేరు సంజీబ్ తాలూక్దార్. 2019 నాటి గౌహతిలో పేలుడు కేసులో ఈ మాజీ విద్యార్థి నాయకుడు నిందితుడుగా ఉన్నాడు. అయితే చదువుకోవాలన్న తన ఆకాంక్షను ఆపలేదు. కృష్ణ కంఠ హ్యాండిక్ స్టేట్ ఓపెన్ యూనివర్శిటీ (KKHSOU)లో దూర విద్య నభ్యసించాడు. జైలులో నుండి చదివి, ఎం.ఏ సోషియాలజీలో యూనివర్శిటీ టాప్ గా నిలిచాడు. గోల్డ్ మెడల్ సాధించాడు. గవర్నర్ జగదీష్ ముఖీ చేతుల మీదుగా దాన్ని అందుకుని ఔరా అనిపించాడు.
2019, మేలో గౌహతి పేలుడులో జరగ్గా, ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. అనుమానితుడి జాబితాలో ఉన్న సంజీబ్ తాలూక్డార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు. ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన చార్జ్ షీట్ ఆధారంగా విచారణ చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ.. ప్రధాన నిందితుడికి మద్దతు ఇచ్చాడన్న ఆరోపణలు చేస్తూ కుట్ర, చట్ట వ్యతిరేక కార్యాకలాపాల కింద సంజీబ్ పై అభియోగాలు మోపింది. జైలులో ఉండి ఎం.ఏ చదివి, 71 శాతం మార్కులతో యూనివర్శిటీ టాపర్ గా నిలిచాడు. గోల్డ్ మెడల్ రావడంపై ఆయన సోదరి డాలీ మిశ్రమ ఆనందాన్ని కనబర్చారు. అతడు చాలా అమాయకుడని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
పేలుడు జరిగిన సమయంలోనే తన సోదరుడు బోటనీలో ఎంఫిల్ చేస్తున్నాడని సోదరి డాలీ తెలిపారు. అప్పటికే కోర్సు థియరీ పూర్తి చేశాడని, అయితే జైలులో లాబోరేటరీ అందుబాటులో లేకపోవడంతో ఎంఫిల్ చేయలేకపోయాడని తెలిపారు. జైలు నుండి విడుదల అయ్యాక పూర్తి చేస్తాడన్న విశ్వాసాన్ని కనబర్చారు. కాగా, ఇతడి బెయిల్ పిటిషన్ మరో నాలుగు నెలల్లో గౌహతి హైకోర్టుకు రానుంది. అయితే అతడికి అనుకూలంగా తీర్పు వస్తుందని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు. సంజీవ్ ఇగ్లో నుండి హెచ్ఐవి, ఫ్యామిలీ ఎడ్యుకేషన్, సర్టిఫికేట్ ఇన్ హ్యుమన్ రైట్స్ కోర్సులను కూడా పూర్తి చేశాడు.