కాబోయే భర్త విషయంలో అమ్మాయిలకు కొన్ని కోరికలు, కలలు ఉంటున్నాయి. భర్త అందంగా ఉండటంతో పాటు ఆస్తి ఉండాలని కోరుకుంటున్నారు. పెళ్లి విషయంలో తమ ఆలోచనలను మొహమాటం లేకుండా తల్లిదండ్రులకే కాదూ ఆమెను చేసుకునేందుకు వస్తున్న వరుడికి, అతడి కుటుంబ సభ్యులకు చెబుతున్నారు.
పెళ్లి చేసుకోవాలంటే నేటి యువతకు కొన్ని కలలు ఉన్నాయి. ముఖ్యంగా అమ్మాయిలకు. గతంలా తల్లిదండ్రులు చూపించిన వ్యక్తిని తలొంచుకుని తాళి కట్టించుకునేందుకు సిద్ధంగా లేరు ఈతరం యువతులు. కాబోయే భర్త విషయంలో వారికంటూ కొన్ని కోరికలు, కలలు ఉంటున్నాయి. అందం, ఆస్తి, సెన్సాఫ్ హ్యుమర్, మంచి సంపాదన ఉండాలని కోరకుంటున్నారు. పెళ్లి విషయంలో తమ అభిప్రాయలను మొహమాటం లేకుండా తల్లిదండ్రులకే కాదూ ఆమెను చేసుకునేందుకు వస్తున్న వరుడికి, అతడి కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. వీరి డిమాండ్లకు తలొగ్గితేనే పెళ్లి. లేదంటే బ్యాచులర్ గా ఉండేందుకైనా సంసిద్ధులు అవుతున్నారు. ఇక మొహమాటానికి పోయి తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చేసుకునేందుకు వచ్చిన ఆడ పిల్లలు.. వరుడు నచ్చకపోతే పెళ్లి పీటల మీదే వివాహాన్ని రద్దు చేసుకుంటున్నారు. అటువంటి సంఘటనే ఒకటి బీహార్‌లో చోటుచేసుకుంది.
ఇంకాసేపట్లో మూడు ముళ్లు పడతాయి అనగా పెళ్లి కుమారుడు నచ్చలేదని ఆ తంతునే ఆపేసింది వధువు. ఈ ఘటన బీహార్‌లోని బాగల్‌పుర్‌లోని కహల్‌గావ్ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే వినోద్ మండల్ కుమార్తె కిట్టు కుమారికి ధనౌరా నివాసి డాక్టర్ వీరేంద్ర సింగ్ కుమారుడు నీలేష్ కుమార్ సింగ్‌తో పెళ్లి కుదిర్చారు పెద్దలు. పెళ్లికి ముందు అతడిని చూడలేదు. పెళ్లి తంతులో భాగంగా ఊరేగింపుగా వివాహ వేదికపైకి వచ్చిన వరుడ్నిచూసిన వధువు మొహం ఒక్కసారిగా మారిపోయింది. వరుడి మెడలో దండ వేసి, తిలకం పెట్టేందుకు ససేమీరా అంది. వరుడి కుటుంబ సభ్యులు ఆమెను పెళ్లికి ఒప్పించేందుకు ఎన్ని చెప్పినా ఆమె వినలేదు. తనకంటే వయస్సులో పెద్ద వాడిలా కనిపిస్తున్నాడని, నల్లగా ఉన్నాడని యువతి..అతడ్ని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేంది. దీంతో ఏమీ చేసేదీ లేక వివాహాన్ని రద్దు చేశారు పెద్దలు.