విద్యాశాఖ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ధరించే బట్టలపై ఓ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగులు జీన్స్, టీ షర్ట్స్ ధరించకూడదని విద్యాశాఖ డిపార్ట్ మెంట్ ఆదేశాలు జారీ చేసింది.
సమాజంలో దైవంతో సమానంగా భావించబడేది గురువులు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు అందరికి ఆదర్శవంతంగా ఉండాలి. ఉత్తమ గుణాలు కలిగి, మంచి ప్రవర్తనతో విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాలి. విద్యార్థులకు పాఠాలు బోధించి వారి భవిష్యత్ కు బంగారు బాటలు వేసి ఉన్నత స్థితిలో స్థిరపడడానికి కృషి చేస్తారు ఉపాధ్యాయులు. అటువంటి ఉపాధ్యాయులకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి. అయితే కాలం మారుతోంది. ఒకప్పుడు సాధారణ దుస్తులు ధరించి విధులకు హాజరైన ఉపాధ్యాయులు నేటి రోజుల్లో జీన్స్, టీషర్ట్స్ ధరిస్తూ పాఠశాలలకు వస్తున్నారు. తాజాగా ఓ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, విద్యాశాఖ ఉద్యోగులు ధరించే దుస్తులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టీచర్స్ జీన్స్, టీ షర్ట్స్ ధరించి స్కూల్స్ కు రాకూడదని ఉత్తర్వులు జారీ చేసింది.
ఒక వ్యక్తి యొక్క వేషధారణను బట్టి అతడి నడవడికను అంచనావేయవచ్చు. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఫార్మల్ దుస్తులు ధరించి విధులు నిర్వహిస్తేనే వారు హూందాగా కనిపిస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బిహార్ విద్యా శాఖ ఆఫీసుల్లో జీన్స్ మరియు టీ-షర్టులు ధరించడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు మరియు అధికారులందరికీ డ్రెస్ కోడ్‌ను అమలు చేయాలని భావిస్తుంది. గౌరవ మర్యాదలు కాపాడుకోవడం మరియు కార్యాలయ నియమాలకు కట్టుబడి ఉండటం యొక్క ప్రాముఖ్యతను ఎత్తిచూపుతూ బిహార్ విద్యా శాఖ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇకపై విద్యాశాఖ సంబంధిత కార్యాలయాల్లో ఉద్యోగులు జీన్స్, టీ షర్ట్స్ ధరించకూడదని విద్యాశాఖ డిపార్ట్ మెంట్ కీలక ఆదేశాలు జారీచేసింది. కార్యాలయ నిబంధనలకు విరుద్దంగా ఉద్యోగులు దుస్తులు ధరిస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇకపై విద్యాశాఖకు సంబందించిన అన్ని ఆఫీసుల్లోని ఉద్యోగలు జీన్స్ , టీ షర్ట్స్ కాకుండా ఫార్మల్ దుస్తులు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలకనుగుణంగా ఉద్యోగులు నడుచుకోవాలని బిహార్ విద్యాశాఖ కోరింది.