పంజాబ్ లో మరో రెండు వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. ఇసుక అక్రమ మైనింగ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అధికారులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నేడు ఆయనను కోర్టులో హాజరుపర్చే అవకాశముంది.
భూపిందర్ సింగ్ హనీ స్వయానా చన్నీ మేనల్లుడు. ఈయన పంజాబ్ రియల్టర్స్ పేరుతో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ కోట్ల కొద్దీ సల్లధనాన్ని ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా రెండు వారాల క్రితం భూపిందర్ సింగ్ ఇల్లు, కార్యాలయాలలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. మోహాలి, లూథియానా, రూప్‌నగర్, చండీగఢ్, పరాన్ కోట్ సహా మొత్తం 12 చోట్ల ఈ తనిఖీలు జరిగాయి. సోదాల్లో దాదాపు రూ.10 కోట్ల మేర అక్రమ నగదు, 21 లక్షల విలువైన బంగారం, ఖరీదైన రోలెక్స్ వాచ్‌ను స్వాధీనం చేసుకుంది. విచారణ సందర్బంగా అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు భూపిందర్ సమాధానం ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నేడు కోర్టులో ప్రవేశపెట్టి రిమాండుకు తరలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఈడీ సోదాలపై స్పందించిన చన్నీ, ఇది కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భద్రతా ఉల్లంఘనలకు ఇది ‘ప్రతీకారం’ అని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తెచ్చేందుకే కేంద్రం ఇలాంటి చర్యలకు పూనుకుంటోందని దుయ్యబట్టారు. తనను ఇరికించేందుకు ఈడీ, ఇన్‌కమ్ ట్యాక్స్, ఇతర ఏజెన్సీలను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని ఆయన అన్నారు. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్ లో లో ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.