కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అని బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. రీల్ లైఫ్ లో ఇలాంటివి జరుగుతాయి కానీ రియల్ లైఫ్ లో ఇలాంటివి జరగవు. అయితే ఒక మేక కన్ను ఒక మనిషి ప్రాణం తీసింది. అసలేం జరిగిందంటే?
కొన్ని సార్లు దురదృష్టం దండయాత్ర చేసినప్పుడు అరటిపండు తిన్నా పన్ను విరుగుద్ది అన్నట్టు చావు కూడా చాలా విచిత్రంగా, ఊహించని విధంగా వస్తుంది. ఇలా కూడా వస్తుందా? అసలు దాని వల్ల ఏమీ కాదు అనుకుంటే.. దాని వల్లే ప్రాణం కోల్పోవడం జరుగుతుంది. మనిషికి చావు అనేది ఎప్పుడు ఏ రూపంలో ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. అదొచ్చిందంటే ఇక వెళ్లిపోవాల్సిందే. కొందరికి నిద్రలోనే కన్నుమూసేలా చావు వస్తే.. కొందరికి ప్రమాదం రూపంలో వస్తుంది. కానీ ఓ వ్యక్తికి మాత్రం చావు మేక కన్ను రూపంలో వచ్చింది. మేక సాధు జీవి. మనిషిని ఏమీ చేయలేదు. అలాంటిది ఒక మనిషి చావుకి కారణమైందంటే ఆశ్చర్యం వేస్తుంది. అవును మేక వల్ల ఒక మనిషి ప్రాణాలు కోల్పోయాడు. మేక కన్ను పడింది.. అంతే ఆ మనిషి మరణించాడు.
కన్నుకి అంత శక్తి ఉంటుందా? మేక కను దిష్టి తగిలి చనిపోయిందా? అని అనుకుంటున్నారా? అదేమీ కాదు. మనుషులకు దిష్టి పెట్టడానికి మేక ఏమీ మనిషి కాదుగా. నరదిష్టిలా మేక దిష్టి అని అనుకోకండి. అసలేం జరిగిందంటే? ఛత్తీస్ గఢ్ లోని సూరజ్ పూర్ జిల్లా మదన్ పూర్ గ్రామానికి చెందిన బగార్ రాయ్ (50) స్నేహితులతో పాటు ప్రముఖ కోపా ధామ్ మందిర్ కి వెళ్ళాడు. తన కోరిక నెరవేరితే కోపా ధామ్ కి వస్తానని మొక్కుకోవడంతో కోరిక నెరవేరిందని అక్కడకు వెళ్ళాడు. పూజలు అనంతరం మేకలను బలి ఇచ్చి.. ఆ మాంసంతో వంటలు చేయించాడు. ఆ తర్వాత గ్రామస్తులకు భోజనం వడ్డించాడు. తాను కూడా మేక మాంసంతో భోజనం తిన్నాడు. బగార్ రాయ్ కి తింటున్న మాంసంలో మేక కన్ను పడింది. ఆ కన్ను అతని గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డాడు. గ్రామస్తులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు.