మాల్స్‌లో బిల్లింగ్ దగ్గర మొబైల్ నంబర్ అడుగుతుంటే ఇచ్చేస్తున్నారా? ఐతే రిస్క్ లో పడతారు. బిల్లింగ్ సమయంలో ఎవరైనా మొబైల్ నంబర్ అడిగితే ఇవ్వకండి అంటూ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
ఏదైనా షాపింగ్ మాల్ కి గానీ, సూపర్ మార్కెట్ కి గానీ వెళ్ళేటప్పుడు బిల్లింగ్ సమయంలో మన ఫోన్ నంబర్ అడుగుతారు. ఫోన్ నంబర్ ఇస్తే మన నంబర్ మీద రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి కదా అని ఇచ్చేస్తాం. అయితే ఫోన్ నంబర్ ఇవ్వడం వల్ల మోసపోయే అవకాశం ఉంది. మన ఫోన్ నంబర్ ఇవ్వడం వల్ల షాపింగ్ మాల్ వారు మన వాట్సాప్ నంబర్ కి ప్రమోషనల్ మెసేజులు పంపిస్తుంటారు. ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి మనకి మెసేజులు పంపిస్తారు. ఇంతవరకూ బానే ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో మనకి స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజులు వస్తుంటాయి. ఆ మెసేజులకి, కాల్స్ కి రెస్పాండ్ అయితే మోసపోయినట్టే. క్షణాల్లో మన బ్యాంకు ఖాతాల్లో డబ్బు మాయమైపోతుంది.
అసలు జీవితంలో ఒక్కసారి కూడా చూడని నంబర్ల నుంచి కాల్స్ వస్తుంటాయి. వాళ్లకి ఎలా వెళ్ళింది మన నంబర్, ఎవరిచ్చారు రా మీకు అని జుట్టు పీక్కోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఆ నంబర్లు ఎలా వెళ్తున్నాయి అంటే బల్క్ గా ఫోన్ నంబర్లను కొనేస్తుంటారు. ఒక్కో నంబర్ కి ఇంత అని ఇచ్చి కస్టమర్ల నంబర్లు తీసుకుంటారు. ఆ నంబర్లకు కాల్ చేసి ఫోన్ లో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారు. ఒకే ఒక్క లింకుని పంపి క్లిక్ చేసేలా చేస్తారు. అందుకే షాపింగ్ మాల్స్ లో బిల్లింగ్ అప్పుడు ఫోన్ నంబర్లు అడిగితే ఇవ్వకూడదు. అసలు ఫోన్ నంబర్ ఇవ్వకపోతే ఏమవుతుంది అని కూడా ఆలోచించము. ఫోన్ నంబర్ ఇవ్వకపోతే బిల్ జనరేట్ చేయడం కుదరదు అని చెబుతుంటారు కొంతమంది. అయితే ఫోన్ నంబర్లు చెప్పాల్సిన పని లేదని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
షాపుల్లో గానీ బయట గానీ కస్టమర్ల నుంచి ఫోన్ నంబర్లు సేకరించకూడదని స్పష్టం చేసింది. ఫోన్ నంబర్ ఇవ్వకపోతే బిల్ ప్రాసెసింగ్ పూర్తి కాదని చెబుతారని.. ఇది వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం అన్యాయమైన, నిర్బంధ వాణిజ్య పద్ధతి కిందకు వస్తుందని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ వెల్లడించారు. కస్టమర్ నుంచి ఫోన్ నంబర్లు, ఇతర సమాచారాన్ని సేకరించడంలో హేతుబద్ధత అనేది లేదని ఆయన అన్నారు. వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా రిటైల్ పరిశ్రమలు, ఇండస్ట్రీ ఛాంబర్స్ కు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వంటి వాటికి అడ్వైజరీ జారీ చేసినట్లు తెలిపారు.
ఏదైనా ఉత్పత్తి డెలివరీ చేయడానికి లేదా బిల్లును రూపొందించడానికి షాపుల వారికి ఫోన్ నంబర్లు చెప్పడం అవసరం లేదని అన్నారు. అయినా కూడా మొబైల్ నంబర్లు ఇస్తే కస్టమర్లు రిస్క్ లో పడతారని హెచ్చరించారు. మాల్స్ లోనే కాదు, బయట కూడా లక్కీ డ్రా పేరుతో వివరాలు, ఫోన్ నంబర్ తీసుకునేవారు కనిపిస్తారు. వీరికి మన నంబర్, వివరాలు ఇస్తే మోసపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఫోన్ కాల్స్, మెసేజుల ద్వారా మోసపోతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజుల ద్వారా మోసాలు జరుగుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతుండటంతో వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి ఇకపై ఎవరైనా బిల్లింగ్ సమయంలో మొబైల్ నంబర్ అడిగితే ఇవ్వకండి. బలవంతం చేస్తే ఫిర్యాదు చేయండి. కానీ మోసపోయే అవకాశం ఇవ్వకండి.