కుక్కలు ఎంతో విశ్వాసం గల సాధు జంతువులు. కుక్క మనిషి మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు అంటారు. కుక్కలను ఎంతగా ప్రేమిస్తే.. అవి మనుషుల పట్ల అంత విశ్వాసంగా ఉంటాయి. ఈ మద్య చాలా మంది కుక్కలను ఇంటి సభ్యుల్లా చూసుకుంటున్నారు.. అవి చనిపోతే కుటుంబంలో వ్యక్తి చనిపోయినంతగా బాధపడుతున్నారు. వాటికి సమాధులు కూడా కట్టిస్తున్నారు. కొన్ని పెంపుడు కుక్కలు యజమాని కోసం దేనికైనా సిద్దపడుతుంటాయి.. చివరికి తమ ప్రాణాలు పోయినా సరే యజమానిని రక్షించుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఓ కుక్క తన యజమాని కోసం విష సర్పంతో పారాడి చివరికి ప్రాణాలు అర్పించింది. ఈ ఘటన మద్యప్రదేశ్ లో జరిగింది.
మధ్యప్రదేశ్ లో ప్రతాప్ పూర్ కి అమిత్ రాయ్ అనే వ్యక్తి కుక్కల పెంపకం అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే ఆయన వివిధ ప్రదేశాల నుంచి రక రకాల కుక్కలను తెచ్చుకొని పెంచుకుంటున్నాడు. అమిత్ రాయ్ ఐదేళ్ల క్రితం అమెరికాకు చెందిన ఒక జాతి కుక్కను తెచ్చుకొని దానికి గబ్బర్ అని పేరు పెట్టకొని ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నాడు. గబ్బర్ కూడా అమిత్ అంటే ఎంతో విశ్వాసం చూపిస్తుంది.. ఎంతగా అంటే అమిత్ అనుమతి లేకుండా ఎవరినీ దగ్గరకు కూడా రానిచ్చేది కాదు.
బుధవారం ప్రతాప్ పురాలో ఉన్న తన ఫామ్ హౌజ్ కి గబ్బర్ తో వెళ్తున్నాడు అమిత్ రాయ్. అదే సమయంలో రక్త పింజరి పాము అతనిపై దాడి చేసే యత్నం చేసింది. అది గమనించిన గబ్బర్ వెంటనే దానిపైకి దూకి చంపేసింది. ఆ సమయంలో రక్త పింజరి గబ్బర్ ని కాటు వేయడంతో వెంటనే విషం ఎక్కేసింది. కొద్దిసేపటి తర్వాత కన్నుమూసింది. తన కోసం ప్రాణాలకు తెగించి చనిపోయిన కుక్కను తల్చుకొని అమిత్ రాయ్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజంగా యజమాని కోసం పోరాటం చేసి చనిపోయిన గబ్బర్ ని హీరోగా పోల్చుతున్నారు నెటిజన్లు.