ఈ రోజుల్లో ఆస్పత్రులకు వెళ్లాలంటే జనాలు భయపడుతున్నారు. చిన్న రోగానికి వైద్యం చేయడానికీ వేల రూపాయలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఓ డాక్టర్ గొప్ప మనసు చాటుకుంటున్నారు. తన ఆస్పత్రిలో ఆడపిల్ల పుడితే పైసా తీసుకోవడం లేదు. ఆ వైద్యుడి కథ మీ కోసం..
వైద్యవృత్తిని ఎంతో పవిత్రంగా భావించే వాళ్లు చాలా మంది ఉన్నారు. రోగులకు సేవ చేసేందుకు తమ జీవితాలను అంకితం చేసినవారు కూడా ఉన్నారు. అలాంటి డాక్టర్లు ఉన్నారు కాబట్టే వైద్యవృత్తికి సమాజంలో ఎంతో గౌరవం ఉంది. చావుబతుకుల్లో ఉన్న వారిని కాపాడిన డాక్టర్లు ఉన్నారు కాబట్టే వారిని దేవుళ్లుగా భావించే వారూ ఉన్నారు. అలాంటి ఓ డాక్టరే గణేశ్ రాఖ్. గైనకాలజిస్ట్ అయిన గణేశ్‌కు ఆడపిల్లలంటే ప్రాణం. ఆడపిల్ల పుట్టిందనగానే ముఖం చిట్లించే వారిని తన సర్వీసులో ఎంతో మందిని చూశారాయన. కానీ, గణేశ్‌కు మాత్రం అమ్మాయి అంటే ‘లక్ష్మీదేవి’తో సమానం. అందుకే తన ఆస్పత్రిలో ఆడపిల్ల పుడితే పేషెంట్ నుంచి ఒక్క పైసా తీసుకోడు. మన దగ్గర ఉగాదిలాగే మహారాష్ట్రలో గుడిపడ్వా జరుపుకుంటారు. 2007లో సరిగ్గా అదే పండుగ రోజు హడాప్సర్ నగరంలో మెడికేర్ హాస్పిటల్‌ను డాక్టర్ గణేష్ ప్రారంభించారు.
తన ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకున్న వారికి ఆడపిల్ల పుడితే పైసా తీసుకోకూడదని ఆయన 2012లోనే డిసైడ్ అయ్యారు. ఈ ఏడాది ఉగాది పండుగతో ఆ గొప్ప సంకల్పానికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటిదాకా 2,470 ఫ్రీ డెలివరీలు చేసిన గణేష్.. ఏ రూపంలోనూ రోగుల నుంచి పైసా తీసుకోకపోవడం గమనార్హం. ఆస్పత్రిలో ఓపీ మొదలుకొని అన్ని సదుపాయాలను ఖర్చులేకుండా సమకూర్చారు. ఆడపిల్ల పుడితే ఫ్రీ ట్రీట్మెంట్ అని ప్రకటించగానే మొదట్లో గణేశ్ రాఖ్‌ను కొందరు ‘మ్యాడ్ డాక్టర్’ అని పిలిచారు. ఒకప్పుడు అలా విమర్శించిన నోళ్లే ఇప్పుడు ఆయన మీద ప్రశంసల జల్లులు కురిపిస్తున్నాయి. గణేశ్ రాఖ్ అందిస్తున్న సేవలు మెచ్చి ఇతర డాక్టర్లు, నర్సులు తమ వంతుగా రోగులకు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. మరి.. ఆడపిల్ల పుడితే పైసా తీసుకోకుండా సేవలు అందిస్తున్న ఈ డాక్టర్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.