కొంతమంది వైద్యులు పవిత్రమైన వైద్య వృత్తికే కలంకం తెస్తున్నారు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తు రోగులకు, రోగుల కుటుంబాలకు తీరని మనోవేదనను మిగులుస్తున్నారు. తాజాగా, జరిగిన ఓ ఘటన వైద్యులపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టేదిలా ఉంది. ఓ వైద్యుడు బ్రతికున్న ఓ మహిళకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చాడు. పోస్టుమార్టం కోసం మార్చురీకి తీసుకెళ్లగా.. అక్కడ అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌కు చెందిన జామ్‌వతి అనే మహిళ ఫిబ్రవరి 24వ తేదీన ఉత్తరప్రదేశ్, మహోబా జిల్లాలోని సోదరిని కలవటానికి వెళ్లింది.
ఈ నేపథ్యంలో ఆమెకు యాక్సిడెంట్ జరిగింది. కొన్ని రోజులు ఝాన్సి జిల్లా ఆసుపత్రిలో చేరింది. ఆ తర్వాత ఆమెను గ్వాలియర్‌లోని ట్రోమా సెంటర్‌కు తీసుకువచ్చారు. గత కొద్దిరోజుల నుంచి ఆమెకు అక్కడే చికిత్స జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ డాక్టర్ జామ్‌వతి చనిపోయిందని తేల్చాడు. ఈ మేరకు డెత్ సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు. జామ్‌వతి నిజంగానే చనిపోయిందని భావించిన కుటుంబసభ్యులు ఆమెను పోస్టుమార్టం కోసం మార్చురీ రూంకు తరలించారు.
ఈ సమయంలో ఆమె వెంట ఉన్న ఓ వ్యక్తి జామ్‌వతి శరీరంలో కదలికలను గుర్తించాడు. వెంటనే వైద్యులకు సమాచారం ఇచ్చాడు. ఆమెను మరో సారి పరీక్షించిన వైద్యులు బ్రతికేఉందని తేల్చారు. మరల చికిత్స మొదలుపెట్టారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై స్పందించిన సంబంధిత శాఖ మంత్రి సీరియస్ అయ్యారు. బతికున్న మహిళను చనిపోయిందన్న వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరిటెండెంట్‌ను ఆదేశించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.