చదువుకోవాలనే ఆకాంక్ష ఎంతోమంది పేదరికంలో ఉన్న విద్యార్థులు.. సరైన వసతులు లేక వారి ఆశలు అడియాశలుగానే మిగిలిపోతుంటాయి. కొంతమంది విద్యార్థులు ఎన్ని కష్టాలు పడైనా సరే ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అందరూ మెచ్చుకునే విధంగా అత్యధిక మార్కులు తెచ్చుకొని తల్లిదండ్రుల గౌరవాన్ని నిలుపుతారు.
కృషీ.. పట్టుదల ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేస్తుంటారు. ప్రస్తుతం సొసైటీలో చదువుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు.. కానీ కొంతమంది పేదరికం వల్ల పై చదువులు చదవలేక మద్యలోనే ఆపేస్తున్నారు. కానీ కొంతమంది ఎంత పేదరికంలో ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ కష్టపడి మంచి మార్కులు సంపాదించి ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. ఓ నిరుపేద కూలీ కూతురు ఇంటర్ లో అద్భుతం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
తమిళనాడులో ఓ అమ్మాయి ఇంటర్ లో అద్భుతం చేసి.. ఇంటర్ సెకండ్ ఇయర్ లో 600లకు 600 మార్కులు సాధించి అందరిచే శభాష్ అనిపించుకుంది. ఇంటర్ లో ఈ మార్కులు ఎంతో మందికి వచ్చాయి.. ఇందులో అంత ప్రత్యేకత ఏముందన్న అనుమానం రావొచ్చు.. కానీ ఈ మార్కులు సాధించిన అమ్మాయి ఓ నిరుపేద కూలీ కూతురు. పేరు ఎస్ నందని.. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకుంది. నందిని తల్లిదండ్రులు కూలీలు.. ప్రతిరోజు పనిచేస్తే కానీ పూటగడవడం కష్టం. అలాంటిది తమ కూతురు చదువు భారం అయినప్పటికీ కాయకష్టం చేస్తూ చదివించారు. తల్లిదండ్రుల శ్రమ వృథా కానివ్వకుండా నందిని అందరూ గర్వపడేలా చేసింది.
నందిని అన్నామలైయర్ మిల్స్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ గవర్నమెంట్ స్కూల్ లో చదివింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ రిజల్ట్ సోమవారం, మే8 న విడుదల చేసింది. ఈ క్రమంలో నందిని తమిళం, ఎకనామిక్స్, ఇంగ్లీష్, కామర్స్, అకౌంటెన్సీ, కంప్యూటర్ అప్లికేషన్ ఇలా ఆరు సబ్జెక్ట్స్ లో వందకు వంద మార్కులు సాధించింది. అయితే ఈ మార్కులు తాను ఊహించలేదని.. తన కష్టానికి మంచి ఫలితం వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది. ఫలితాలు వెలువడిన తర్వాత తమ కూతురు సాధించిన మార్కులు చూసి తల్లిదండ్రులు భానుప్రిచ, శరవణ కుమార్ లు ఆనందంతో పొంగిపోయారు. నందిని సాధించిన ఘనతపట్ల టీచర్లు హర్షం వ్యక్తం చేశారు.