కృషి, పట్టుదల ఉంటే సక్సెస్ అవ్వచ్చని ఎంతోమంది నిరూపించారు. గొప్ప చదువులు ఉంటేనే సక్సెస్ అవుతారనుకునే వారికి.. టాలెంట్ ఉంటే చదువుతో పని లేకుండా సక్సెస్ అవ్వచ్చునని నిరూపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆలోచన మన జీవితంతో పాటు, అవతల వారి జీవితాలను మార్చగలిగితే సక్సెస్ అయినట్టే అని కమర్షియల్ గా ప్రూవ్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆలోచన కమర్షియల్ గా ఉంటే సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుందనేది జగమెరిగిన సత్యం. తాజాగా ఒక యువకుడు కూడా తన ఆలోచనను కమర్షియల్ గా మార్చాడు. సక్సెస్ అయ్యాడు. ఇంటర్ తో చదువు ఆపేసి బస్సు డ్రైవర్ గా చేయాలని నిర్ణయించుకున్న ఆ యువకుడు.. ఆ ఉద్యోగం దొరక్క రిక్షావాలాగా మారాడు. మధ్యలో జరిగిన కథని కట్ చేస్తే ఈరోజు కోట్ల టర్నోవర్ తో వ్యాపారవేత్తగా మారాడు.
బీహార్ లోని సహర్సా జిల్లాలోని బన్ గావ్ గ్రామానికి చెందిన దిల్ ఖుష్ కుమార్ అనే యువకుడు ఇంటర్ తో చదువు ఆపేశాడు. ఈ చదవడాలు, ప్యాస్ అవ్వడాలు మన వల్ల కాదేహే అని పై చదువులకు వెళ్ళలేదు. బస్సు డ్రైవర్ అవుదామని ఏడేళ్ల క్రితం బీహార్ నుంచి ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ ఉద్యోగం కోసం వాళ్ళని, వీళ్ళని బతిమిలాడినా ఉద్యోగం దొరకలేదు. దీంతో రిక్షాలాగుదాం అని ఫిక్స్ అయ్యాడు. బస్సు ఐతే ఏంటి, రిక్షా అయితే ఏంటి? ప్రయాణికుల అవసరాలు తీర్చడమే కదా మన పని అని రిక్షావాలాగా చేశాడు. అయితే చిన్న పని అయినా నిజాయితీగా చేస్తే చిన్న చూపు చూసే సమాజం ఒకటి ఉంటుంది కదా. ఆ సమాజమే కుమార్ ని కూడా వెక్కిరించింది. రిక్షా లాగుతున్నావా తూ అంటూ అవమానించింది.
దీంతో కొన్నాళ్ళు రిక్షావాలాగా పని చేసిన కుమార్.. సొంతూరు వచ్చేసి ఇంటింటికీ తిరిగి కూరగాయలు అమ్మేవాడు. జిరాక్స్ షాప్ కూడా నడిపాడు. అప్పుడూ అవమానాలే. అయితే చిన్నప్పటి నుంచి వ్యాపారవేత్త అవ్వాలని కలలు కన్న కుమార్ కి.. ఈ పనులు సంతృప్తిగా అనిపించలేదు. దీంతో తెగించి రిస్క్ అయినా పర్లేదని 2016లో స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. చిన్నప్పటి నుంచి కారు మీద ఉన్న ఇష్టంతో సొంత ఊరిలో ఆర్యగో అనే క్యాబ్ సర్వీస్ సంస్థను ప్రారంభించాడు. సెకండ్ హ్యాండ్ నానోతో ఒకే ఒక డ్రైవర్ తో గేదెల పాకలో క్యాబ్ సర్వీస్ ని మొదలుపెట్టాడు. మొదట్లో ఇది అయ్యే పని కాదు అని నిరుత్సాహపరిచేవారు. కానీ తన మీద తనకున్న నమ్మకంతో ముందుకు వెళ్ళిపోయాడు.
అలా గేదెల పాకలో మొదలైన క్యాబ్ సర్వీస్.. రెండేళ్లలో 500 డ్రైవర్లతో బీహార్ లో ఏడు జిల్లాలకు విస్తరించింది. ఆ తర్వాత సాంకేతిక విజ్ఞానాన్ని వాడుకుని.. తన వ్యాపారాన్ని పెంచుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అంతే అనుకున్నదే తడవుగా.. రోడ్ బెజ్ అనే యాప్ ని తీసుకొచ్చాడు. బీహార్ లో ఏ మారుమూల ప్రాంతం నుంచి అయినా వేరే ప్రాంతానికి కారులో వెళ్లేలా 2022లో ఈ ప్రత్యేకమైన యాప్ ని తీసుకొచ్చాడు. దీని కోసం ఐఐటీ, ఐఐఎమ్ లలో చదివిన వాళ్లనే ఉద్యోగంలో చేర్చుకున్నాడు. వన్-వే ట్యాక్సీ విధానాన్ని తీసుకొచ్చి.. బీహార్ లో ఒక ట్యాక్సీ చైన్ ని సృష్టించాడు. ఓలా, ఉబర్ లాంటి సంస్థలకు భిన్నంగా దూర ప్రాంతాలకు క్యాబ్ లు వస్తుండడంతో రోడ్ బెజ్ కు ఆదరణ రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది.
ప్రస్తుతం 4 వేల కార్లతో క్యాబ్ సర్వీస్ అందిస్తున్న దిల్ ఖుష్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. చెప్పులు వేసుకునే వారిని విమానం ఎక్కిస్తానని మోదీ అంటారు. అలానే నేను వారిని కారు ఎక్కించే ప్రయత్నం చేస్తా అని దిల్ ఖుష్ తన డైరీలో రాసుకున్నాడు. రానున్న రోజుల్లో 25 వేల కార్లతో కేరళ నుంచి కాశ్మీర్ వరకూ తన క్యాబ్ సర్వీస్ ని విస్తరిస్తానని చెబుతున్నాడు. ఇదే కుమార్ సక్సెస్ స్టోరీ. ఇంటర్ తో చదువు ఆపేశాడు. సక్సెస్ అవ్వాలంటే పెద్ద చదువులు చదవాల్సిన పని లేదని నిరూపించాడు. ఇంటర్ చదివిన వ్యక్తి దగ్గర ఐఐటీ, ఐఐఎంలలో చదివిన వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. గేదెల పాక నుంచి ఒకే ఒక్క కారుతో మొదలైన వ్యాపారం ఇవాళ 4 వేల కార్లకు విస్తరించింది. ఒకప్పుడు రిక్షా లాగిన వ్యక్తి.. ఇప్పుడు ఒక కంపెనీకి సీఈఓ అయ్యాడు.
జస్ట్ ఐడియా ఉంటే చాలు, శాసించవచ్చునని రుజువు చేశాడు. రిక్షాలాగాడు, ఇప్పుడు ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితాలను ముందుకు లాగుతున్నాడు. అప్పుడూ, ఇప్పుడూ తేడా ఏం లేదు. ఆలోచన సైజ్ పెరిగింది అంతే. ఎదిగే క్రమంలో అవమానాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఆ అవమానాన్ని అభిమానంగా మార్చుకున్నవాడే అసలైన హీరో. మరి మీరు కూడా దిల్ ఖుష్ కుమార్ లా అవమానాలని దాటుకుంటూ.. ఎదిగిపోతారు కదూ. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.