నీరు, కరెంట్ ఈ రెండూ మనిషికి చాలా అవసరం. ఇప్పటికే కరెంటు వాడకానికి విద్యుత్ మీటర్ల ద్వారా ఎన్ని యూనిట్లు వాడితే అన్ని యూనిట్లకు యూనిట్ కి ఇంత అని చెప్పి బిల్ చెల్లిస్తున్నాం. అలానే ప్రభుత్వం ఇచ్చే నీటి సరఫరాకు కూడా ఏడాదికొకసారి పన్ను కడుతున్నాం. అయితే భూగర్భజలాలను (బోరు నీటిని) వాడుకునే వారు కూడా ఇక నుంచి డబ్బులు కట్టాలి. అయితే ఇది అందరికీ కాదు. కేవలం పరిమితి దాటి నీటిని వాడుకునే వారికి మాత్రమే. ఆ పరిమితి ఎంత? అనేది తెలుసుకోండి.
తాగునీరు, గృహ అవసరాల కోసం భూగర్భజలాలను ఉపయోగించే అపార్టుమెంట్లు, గ్రూప్ హోసింగ్ సొసైటీలకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆదేశాలను జారీ చేసింది. రోజూ 20 ఘనపు మీటర్లకు మించి భూగర్భజలాలను ఉపయోగిస్తే గనుక అపార్టుమెంట్లు, గ్రూప్ సొసైటీలు అన్ని నిర్మాణాల వద్ద తప్పనిసరిగా డిజిటల్ వాటర్ ఫ్లో మీటర్లను ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలానే భూగర్భజలాలను ఆధారం చేసుకుని స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భూగర్భజలాల వినియోగ నియంత్రణలో భాగంగా 2020 సెప్టెంబర్ 24న మార్గదర్శకాలను నిర్దేశిస్తూ కేంద్రం ఓ నోటిఫికేషన్ ను జారీ చేసింది. దాన్ని సవరించి కొత్త నోటిఫికేషన్ ను జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన మోడల్ బిల్డింగ్ బైలాస్ మేర వాన నీటి సంరక్షణ ప్రణాళికను కేంద్రానికి సమర్పించాలి. అలానే పరిశ్రమలన్నీ రానున్న మూడేళ్ళలో భూగర్భజలాల వాడకాన్ని 20 శాతం మేర తగ్గించుకోవాలి. ఇక ట్యాంకర్ల ద్వారా భూగర్భజలాలను సరఫరా చేసేవారు ఎన్ఓసీ తీసుకోవాలి. ఉప్పు నీరు తోడుకునేవారు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబరేటరీస్ ద్వారా గానీ ప్రభుత్వంచే గుర్తింపు కలిగిన ప్రయోగశాలలో గానీ బోరుబావిలోని నీటి నాణ్యతపై పరీక్షలు చేయించాలి. వాణిజ్య సంస్థలు భూగర్భజలాలను తోడుకుంటున్నట్లైతే ఎంత నీరు వాడుతున్నారు, ఏ అవసరాలకు వాడుతున్నారో చెబుతూ వాటర్ ఆడిట్ ని ఆన్ లైన్ లో సమర్పించాలి. ఈ నివేదికలను సెంట్రల్, స్టేట్ గ్రౌండ్ వాటర్ అథారిటీస్ బహిర్గతం చేయాలి.
రోజుకు వంద ఘనపు మీటర్లకు మించి భూగర్భజలాలను వాడుకునే పరిశ్రమలు రెండేళ్లకొకసారి కేంద్ర భూగర్భజల అథారిటీ ధృవీకరించిన సంస్థల ద్వారా వాటర్ ఆడిటింగ్ చేయించాలి. ఆ నివేదికలను మూడు నెలల్లోపు కేంద్ర భూగర్భజలాల అథారిటీకి సమర్పించాల్సి ఉంటుంది. తాగు నీరు, గృహ అవసరాల కోసం రోజుకు 25 ఘనపు మీటర్ల వరకూ భూగర్భజలాలను వాడుకున్న వారికి ఎలాంటి ఛార్జీలు ఉండవు. 25 నుంచి 200 ఘనపు మీటర్ల లోపు భూగర్భజలాలను వాడితే ఒక్కో ఘనపు మీటర్ కి రూపాయి చొప్పున వసూలు చేయాలని.. 200 ఘనపు మీటర్లకు పైన వాడితే ఒక్కో ఘనపు మీటర్ కి రూ. 2 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. ఇక ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు ఎంత నీరు వాడినా ఘనపు మీటర్ కి 50 పైసల చొప్పున చెల్లించాల్సిందే. నీటి వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్రం ఇలా డిజిటల్ వాటర్ మీటర్ల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.