రూ. 11 వేల కోట్ల జీఎస్టీ పన్ను ఎగ్గొట్టిన బడా దిగుమతి కంపెనీలకు నోటీసులు పంపించాయి డీజీజీఐ, డీఆర్ఐ ఏజెన్సీలు.
24 అతి పెద్ద దిగుమతుల కంపెనీలు దాదాపు రూ. 11 వేల కోట్ల జీఎస్టీ పన్నులు ఎగ్గొట్టాయని.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ (డీజీజీఐ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) గుర్తించాయి. ఇప్పటి వరకు సుమారు 24 కేసుల్లో రూ. 11 వేల కోట్లు చోరీ జరిగినట్లు గుర్తించామని, 7 యూనిట్లకు తాము నోటీసులు పంపించామని ఏజెన్సీ సీనియర్ అధికారి మీడియా ముందు వెల్లడించారు. గత 20 రోజుల్లో ముంబై, కోల్కతా, చెన్నై అధికార పరిధిలో ఉన్న దిగుమతి కంపెనీలకు నోటీసులు పంపించడం జరిగిందని తెలిపారు. డీజీజీఐ, డీఆర్ఐ ఏజెన్సీలు మిగతా దిగుమతుల కంపెనీలకు కూడా నోటీసులు పంపించే ప్రక్రియను ప్రారంభించాయి.
స్టీలు, ఫార్మస్యూటికల్స్, రత్నాలు, బంగారు ఆభరణాలు, వస్త్రాల దిగుమతుల కంపెనీలు జీఎస్టీ పన్నులు ఎగ్గొట్టాయని తెలిపారు. ఈ కేసుల్లో పన్ను ఎగవేత గురించిన సమాచారం.. ‘అడ్వాన్స్డ్ అనలిటిక్స్ ఇన్ ఇండైరెక్ట్ టాక్సేషన్’ (ఏడీవీఐ) ద్వారా ప్రిపేర్ చేసిన డేటా ఆధారంగా పొందబడింది. ఇన్పుట్ ట్యాక్స్ ను తప్పుగా చూపించినట్టు తెరపైకి వచ్చిందని, ఫీల్డ్ ఫార్మేషన్స్ చేత స్వతంత్రంగా వెరిఫై చేసుకుని నిర్ధారించుకున్న తర్వాతే ఈ కేసుల్లో నోటీసులు పంపించామని ఏజెన్సీ అధికారులు వెల్లడించారు. ఎగుమతి, దిగుమతి కంపెనీల కొత్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేయడానికి అడ్వాన్స్డ్ అనలిటిక్స్ ఇన్ ఇండైరెక్ట్ టాక్సేషన్ విధానాన్ని బలపరచడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు.