ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అంశం వాతావరణ కాలుష్యం. వాటిలో మరీ ప్రధానంగా మారింది నీటి కాలుష్యం. నీటి కాలుష్యానికి ముఖ్య కారణం పరిశ్రమల వల్ల పెరుగుతున్న రసాయన వ్యర్థాలు. తాజాగా ఢిల్లీలో కనిపించిన దృశ్యం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. ఛత్ పూజ సందర్భంగా మహిళలు నదీ స్నానాలు ఆచరించారు ఆ దృశ్యాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. యమునా నది మొత్తం తెల్లటి దుప్పటి కప్పినట్లు నురగతో నిండిపోయింది. ఛత్ పూజలో ముఖ్యంగా నదీ స్నానానికి ప్రాముఖ్యత ఉంటుంది.
మహిళలు అందరూ యమునా నదిలో అలాగే పుణ్యస్నానాలు ఆచరించారు. నదిలో ఉన్న నురగను ఏమాత్రం లెక్కచేయని మహిళలు పుణ్యస్నానాలు చేశారు. అదంతా చూసేందుకు ఏదో సినిమా సెట్టింగ్ తరహాలో ఉంది. ఢిల్లీలో సాధారణంగానే కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో అది ఇంకాస్త పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వాయుకాలుష్యంతో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ ప్రజలకు నీటి కాలుష్యం కూడా మరో పెద్ద సమస్యగా మారింది. అందుకు తాజా దశ్యాలే ఉదాహరణగా చెప్పవచ్చు. వాయు కాలుష్యంతో గొంతు నొప్పి, శ్వాసకోస ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి ఇది పెద్ద సవాలుగానే మారింది.