భారత దేశంలో ఎన్నో సంవత్సరాలుగా వైవాహిక వ్యవస్థ ఎంతో గౌరవం కొనసాగుతూ వస్తుంది. ఈ మద్య కాలంలో చాలా మంది పెళ్లైన ఒక్క ఏడాదిలోనే వివిధ కారణాల వల్ల గుడ్ బై చెబుతున్నారు.
భారత దేశంలో వివాహ వ్యవస్థకు ఎంతో గౌరవం ఇస్తారు. సాధారణంగా పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో మరుపురాని.. మధుమైన ఘట్టం. పెద్దలు.. బంధుమిత్రుల సమక్షంలో, వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతారు నూతన జంట. కానీ ఈ మద్య కాలంలో వివాహ వ్యవస్థకు మచ్చతెచ్చేలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పెళ్లైన ఒక్క సంవత్సరానికే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. వివాహేతర సంబంధాలు, ఆదిపత్య పోరు, ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎన్నో కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోతున్నారు. తన భర్త తనకు శారీరక సుఖం ఇవ్వడం లేదని.. తన వివాహబంధం పురిపూర్ణం కాలేదంటూ ఓ భార్య పెట్టిన క్రిమినల్ కేసులో హైకోర్టు కొట్టేసింది.. అంతేకాదు భార్యతో శారీరక సంబంధాన్ని నిరాకరించడం తప్పేమీ కాదని సంచలన తీర్పు ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఓ మహిళ తన భర్త తనకు శారీరక సుఖం ఇవ్వడం లేదని క్రిమినల్ కేసు పెట్టింది.. ఈ కేసు విచారణలో కర్ణాటక కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. 2019, డిసెంబర్ 18 న ఓ మహిళకు వివాహం అయ్యింది. అప్పటికే ఆమె భర్త ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ సదరు మహిళతో శారీరక సంబంధాన్ని పెట్టుకోవడానికి నిరాకరిస్తూ వచ్చాడు. దీంతో భర్తపై కోపంతో పెళ్లైన 28 రోజులకే ఆమె తన పుట్టింటికి వచ్చేసింది. ఫిబ్రవరి 2020 లో భర్త, అత్తమామలపై ఐపీసీ సెక్షన్ 498 ఎ, వరకట్న నిరోధక చట్టం కింద కేసు పెట్టింది. అలాగే తన భర్త తనకు ఎలాంటి సుఖం ఇవ్వకపోవడం.. హిందూ వివాహ చట్టం ప్రకారం తన వివాహ బంధం పరిపూర్ణం కాలేదు కనుక పెళ్లిని రద్దు చేయాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.
ఆమె పిటీషన్ స్వీకరించిన ఫ్యామిలీ కోర్టు 2022లో వీరి వివాహబంధం రద్దు చేసింది. సదరు మహిళ వివాహబంధం రద్దు అయినప్పటికీ అత్తింటివారిపై పెట్టిన కేసు వాపస్ తీసుకోలేదు. దీంతో సదరు మహిళ భర్త తనపై, తన తల్లిదండ్రులపై నమోదైన ఛార్జ్ షీట్ ను కొట్టేయాలని కోరాడు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం సదరు వ్యక్తికి అనుకూలంగా తీర్పు చెప్పింది. భార్యకి భర్త శారీరక సుఖం ఇవ్వకపోవడం అతడిపై ఉన్న ఆరోపణ హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 12(1)(a) ప్రకారం క్రూరత్వమే అయినప్పటికీ… సెక్షన్ 498 ప్రకారం అది క్రిమినల్ నేరం కిందికి రాదని స్పష్టం చేసింది.
అలాగే ఆ మహిళ వివాహ బంధానికి స్వస్తి చెప్పిందని.. తనతో ఎప్పటికీ ఉండని భర్త, అత్తమామలపై క్రిమినల్ ప్రొసీడింగ్ లను కొనసాగించడం వేధింపులకు గురిచేయడం లాంటిదే అని.. ఈ విషయంలో న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడం లాంటిదని.. ఇది న్యాయవిరుద్దమని భర్త దాఖలు చేసిన పిటీషన్ ను అనుమతిస్తూ అతడిపై ఉన్న క్రిమినల్ కేసును కొట్టేస్తున్నాం’ అంటూ కోర్టు పేర్కొంది.