ఏదైన హోటల్ నుంచి ఫుడ్ డెలివరీ ముక్కలు సరిగ్గా రాలేదని, డెలివరీ బాయ్ సమయానికి రాలేదని ఇలా రకరకాల వాటికి గొడవలు చేస్తూ హల్చల్ చేసిన ఘటనలను మనం చాలా చూశాం. కానీ నోయిడాలో మాత్రం ఫుడ్ డెలివరీ ఆలస్యమైందంటూ ఏకంగా హోటల్ ఓనర్ నే తుపాకితో కాల్చి చంపాడో స్విగ్గీ డెలివరీ బాయ్. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..సునీల్ అనే వ్యక్తి గ్రేటర్ నోయిడాలోని మిత్రా హౌసింగ్ కాంప్లెక్స్ సొసైటీలో ఓ రెస్టారెంట్ ను నడిపిస్తున్నాడు. ఇక రోజులాగే మంగళవారం అర్ధరాత్రి 12: 15 నిమిషాలకు చికెన్ బిర్యానీ, పూరీ సబ్జీ ఆర్డర్ తో దిగాడు ఓ స్విగ్గీ డెలివరీ బాయ్. హోటల్ కు చేరుకుని తనకు కావాల్సిన వాటిని ముందుగా చెప్పాడు. కొంత సమయం తర్వాత ఆ హోటల్ వర్కర్ ను ఆర్డర్ రెడీ అయ్యిందా అంటూ ప్రశ్నించాడు. బిర్యాని మాత్రమే రెడీగా ఉందని, మిగత వాటికి ఇంకాస్త సమయం పడుతుందని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య కాస్త వాదన మొదలైంది.
ఇక రంగంలోకి దిగిన ఆ హోటల్ ఓనర్ సునీల్ డెలివరీ బాయ్ కి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అతడు ఎంతకూ వినకపోవటంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవ కాస్త తీవ్ర రూపం దాల్చింది. ఇక అగ్రహంతో ఊగిపోయిన డెలివరీ బాయ్ తుపాకి తీసి ఓనర్ తలపై కాల్చి పరారయ్యాడు. ఇక వెంటనే హోటల్ వర్కర్లు గ్రహించి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. కాగా స్థానిక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.