ప్రస్తుత ఆధునిక కాలంలో అందరి జీవితాలు ఉరుకులు.. పరుగులే! దాంతో వంట వండుకోవడం కాదు కదా.. కనీసం తినడానికి కూడా సమయం ఉండట్లే. ఈ క్రమంలోనే జనాలు రెస్టారెంట్ల నుంచి ఫుడ్ డెలివరీలు చేసుకోవడం ప్రారంభించారు. ఇంట్లో కూర్చుని సెల్ ఫొన్ లో ఒక్క ఆర్డర్ ఇస్తే చాలు.. నిమిషాల్లో ఫుడ్ మీరున్నచోటికే వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫుడ్ లేట్ గా వస్తే.. కొందరు కస్టమర్లు కస్సు బుస్సులాడటం మనం చూశాం. అలాగే మరికొందరు త్వరగా వచ్చిన వారిని అభినందించడం చూశాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే.. తాజాగా జోమాటో డెలివరీ బాయ్ కు జరిగిన సన్మానం మరో ఎత్తు. గంట లేట్ గా వచ్చిన డెలివరీ బాయ్ కు కస్టమర్ హారతిచ్చి, బొట్టుపెట్టిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త. తాజాగా జోమాటోలో తనకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ రోజు భారీ వర్షంతో పాటు పండుగ సందర్భంగా ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంది. దాంతో డెలివరీ బాయ్ ఓ గంట ఆలస్యంగా ఆర్డర్ ను డెలివరీ చేశాడు. అయినప్పటికీ ఆ డెలివరీ బాయ్ కు కస్టమర్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. డెలివరీ బాయ్ వరండాలోకి రాగానే పాట పాడుతూ.. హారతిచ్చి, బొట్టుపెట్టి, అక్షింతలు వేశాడు. ఇదంతా ఆశ్చర్యంగా అనిపించిన ఆ డెలివరీ బాయ్ నవ్వుతూ.. చూస్తూనే ఉన్నాడు. ఈ సందర్భాన్ని అంతా వీడియో తీసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు సదరు కస్టమర్. ట్రాఫిక్, భారీ వర్షాన్ని సైతం ఛేదించి పండగ రోజు మాకు ఆహారాన్ని అందించినందుకు థ్యాక్స్ అంటూ.. చివర్లో కన్నీటీతో కూడిన ఎమోజీ జత చేశాడు. సదరు కస్టమరు ఆర్డర్ గంట లేట్ గా రావడంతోనే ఇలా వ్యంగ్యంగా జోమాటోకు థ్యాక్స్ చెబుతున్నాడని ఈ వీడియో చూసిన వారంతా కామెంట్స్ పెడుతున్నారు.
ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో నెటిజన్స్ స్పందిస్తున్నారు.”రెండు నిమిషాలు లేటైతేనే ఇష్టం వచ్చినట్లు డెలివరీ బాయ్స్ ని తిట్టే ఈ రోజుల్లో మీలాంటి వారు ఉండటం గ్రేట్ సర్” అని కొందరంటే! ఆ కస్టమర్ ఏ ఉద్దేశంతో ఈ పని చేశాడో అర్దం అవుతూనే ఉందిలెండి! అని మరికొందరు రాకొచ్చారు. ఇదిలా ఉండగా కొందరు మాత్రం లోతుగా ఆలోచించి.. కస్టమర్ మెుహంలో చిరునవ్వే కనిపించింది. ఎటువంటీ కోపం కనిపించలేదు. ఎందుకంటే అది పండగ రోజు.. పైగా భారీ వర్షం.. ఇక ఢిల్లీ ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే సదరు కస్టమర్ డెలివరీ బాయ్ ని అలా ట్రీట్ చేశాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏ ఉద్దేశంతో ఇలాంటి పని చేశాడో ఆ కస్టమర్ కే తెలియాలి.