ఒక వ్యక్తి ఆస్తులు ఎక్కువగా ఉంటే పన్నులు కట్టాల్సి వస్తుందని చెప్పి తన ఆస్తులను బినామీల పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటాడు. అయితే దీని వల్ల నల్లధనం పేరుకుపోయి దేశానికి నష్టం వాటిల్లుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ వ్యక్తి పిటిషన్ వేశారు. బినామీ పేరు మీద ఆస్తుల రూపంలో ఉన్న బ్లాక్ మనీని బయటకు తీసుకురావాలంటే ఆస్తులను ఆధార్ తో అనుసంధానం చేయాలన్న రూల్ ని తీసుకురావాలని పిటిషన్ వేశారు.
సిమ్ కార్డు కావాలన్నా, లోన్ కావాలన్నా, జాబు కావాలన్నా, ఈఎంఐలో ఏదైనా కొనాలన్నా, ఏది కావాలన్నా సరే ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఆధార్ తో ఇప్పటికే పాన్ కార్డును అనుసంధానం చేయమని కేంద్రం పలుమార్లు సూచించింది. ఓటర్ ఐడీ కార్డు వంటి ఇతర డాక్యుమెంట్లతో కూడా ఆధార్ ను అనుసంధానం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్తులను కూడా ఆధార్ తో అనుసంధానం చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బినామీ ఆస్తుల రూపంలో ఉన్న నల్లధనాన్ని బయటకు తీసుకురావాలన్నా, బినామీలు జరిపే అక్రమ లావాదేవీలను అరికట్టాలన్నా, అవినీతిని అంతం చేయాలన్నా ఆస్తులను ఖచ్చితంగా అనుసంధానం చేయాలని బీజేపీ నేత మరియు అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ప్రజలకు చెందిన స్థిరాస్తులు, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆధార్ తో అనుసంధానం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. కేంద్రం యొక్క స్పందనను కోరింది. యూనియన్ మినిస్ట్రీస్ ఆఫ్ ఫైనాన్స్, హోసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, రూరల్ డెవలప్మెంట్ అండ్ లా నుంచి ప్రతి స్పందన కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా ముఖ్యమైన అంశం అని ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ జూలై 18న ఉంటుందని ధర్మాసనం తెలిపింది.
అయితే దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం 2019లోనే తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఆధార్ అనేది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, ల్యాండ్ మ్యుటేషన్ లకు గుర్తింపు డాక్యుమెంట్ గా మాత్రమే అనుమతిస్తామని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఆస్తులతో ఆధార్ అనుసంధానం చేయడం తప్పనిసరి అని చెప్పడానికి చట్టంలో ఎటువంటి నిబంధన లేదని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. మరి ఆధార్ తో ఖచ్చితంగా స్థిరాస్తులు, చరాస్తులు అనుసంధానం చేయడం తప్పనిసరి చేయాలని దాఖలైన పిటిషన్ పై మీ అభిప్రాయమేమిటి? ఈ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ చెప్పినట్టు.. ఆస్తులతో ఆధార్ ను అనుసంధానం చేయడం ద్వారా బినామీ ఆస్తుల రూపంలో ఉన్న నల్లధనం బయటకు తీసుకొస్తారా? ఆస్తులతో ఆధార్ అనుసంధానం చేయడానికి వీల్లేదంటున్న ఢిల్లీ ప్రభుత్వంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్స్ చేయండి.
The #Delhi #HighCourt asked the #Centre to file a reply on a plea seeking to link immovable and movable property documents of citizens with their #Aadhaar numbers to curb #corruption, #blackmoney generation, and benami transactions.https://t.co/Pz4r6KqFQX
— The Federal (@TheFederal_News) April 17, 2023