ఈ మధ్యకాలంలో భారత అత్యున్నత న్యాయస్థానం అనేక సంచలన తీర్పులు ఇచ్చింది. అలానే వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టులు సైతం పౌరలు విస్మయానికి గురై తీర్పులు సైతం ఇస్తున్నాయి. ఇటీవలే కేరళ హైకోర్టు ప్రభుత్వ ఉద్యోగి లంచం అడగటం తప్పుకాదని, లంచం తీసుకుంటే నేరం అంటూ సంచలన తీర్పు ఇచ్చింది. అలానే గతంలో కూడా పలు కోర్టులు వ్యభిచారం, వివాహేతర సంబంధాలు, లైంగిక విషయాలకు సంబంధించిన విషయాలపై ఆసక్తికరమైన తీర్పులు ఇచ్చాయి. మహిళలు పిల్లలను కనే విషయంలో తాజాగా ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అబార్షన్ విషయంలో తుది నిర్ణయం మహిళదేనని ఢిల్లీ హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. పిల్లల్ని కనాలా? వద్దా? పుట్టబోయే బిడ్డకు మంచి జీవితం ఇవ్వగలమా? అనే విషయంలో తుది నిర్ణయం తీసుకునే హక్కు పూర్తిగా మాతృమూర్తిదేనంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
గర్భంలో ఉన్న పిండంలో ఎదుగుదల సమస్యలు ఉన్నట్లు తెలియడంతో గర్భాన్ని తీయించుకోవాలని, అందుకు అనుమతి ఇవ్వాలంటూ 26 ఏళ్ల ఓ మహిళ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తాను గర్భం దాల్చిన 16 వారం వరకు ఎలాంటి ఇబ్బందులు గుర్తించలేదని, ఇటీవలే గర్బంలోని శిశువుకు సమస్య ఉన్నట్లు తెలిసిందని పిటిషనరు కోర్టుకు నివేదించారు. ఆ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు..విచారణ చేపట్టింది. కొన్ని రోజులు పాటు ఈ కేసుపై విచారణ కొనసాగింది. మంగళవారం ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు తుది తీర్పు వెల్లడిచింది. అబార్షన్ విషయంలో అంతిమ నిర్ణయం తల్లిదేనని జస్టిస్ ప్రతిభా ఎం. సింగ్ స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా అబార్షన్ పై చర్చ జరుగుతున్నా.. భారతదేశం మాత్రం మహిళల నిర్ణయాన్ని తన చట్టంలో గుర్తించిందని న్యాయమూర్తి తెలిపారు. పుట్టబోయే బిడ్డకు వైకల్య స్థాయి, బిడ్డ ఎదుగుల విషయంలో మెడికల్ బోర్డు సరైన నిర్ణయం ప్రకటించలేదని న్యాయమూర్తి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలాంటి సమయంలో అబార్షన్ విషయంలో మహిళ అభిప్రాయంతో ఏకిీభవించాల్సి వచ్చిందని న్యాయమూర్తి ప్రతిభ సింగ్ తెలిపారు. నేటి సమాజంలో తల్లిదండ్రులు అనుభవిస్తున్న మానసిక క్షోభ, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులనూ పరిగణనలోకి తీసుకున్న తరువాతనే పిటిషనర్ అబార్షన్ కి అనుమతి ఇస్తున్నట్లు న్యాయమూర్తి చెప్పారు. .