రోజురోజుకీ వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. మరికొన్నాళ్లు ఇలాగే కొనసాగితే పరిస్థితులు ఇంకా దిగజారొచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్ల పైకి పెట్రోల్, డీజిల్ వాహనాలు రాకుండా సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు అంతటా వాయుకాలుష్యం పెరిగిపోతోంది. ఆ దేశం, ఈ దేశం అని కాదు.. అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి. దీనికి భారత్ మినహాయింపేమీ కాదు. వాహనాల వినియోగం బాగా పెరిగింది. ఇంటికి రెండు మూడు వెహికిల్స్ అయిపోయాయి. అలాగే పరిశ్రమల సంఖ్య కూడా బాగా పెరిగింది. వీటి నుంచి వెలువడే వ్యర్థాలు వాయుకాలుష్యానికి కారణం అవుతున్నాయి. అదే సమయంలో పచ్చదనం రోజురోజుకీ తగ్గిపోతుండటంతో ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. మన దేశంలో చూసుకుంటే.. ఢిల్లీ నగరవాసులు వాయు కాలుష్యం బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలికాలంలో అయితే అక్కడ పొగమంచు కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి.
పీల్చే గాలి కూడా స్వచ్ఛంగా లేకపోవడం, పొగమంచు పెరిగిపోతుండటం తదితర కారణాలతో ఢిల్లీ జనాలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఢిల్లీలో ట్యాక్సీ, ఫుడ్ డెలివరీ కంపెనీలు తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వినియోగించాలని ఆప్ సర్కారు తెలిపింది. వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకాన్ని నిలిపివేస్తున్నామని.. ఇందుకోసం ప్రత్యేకంగా వాహన పాలసీని అమలు చేయనున్నట్లు సూచించింది. 2030, ఏప్రిల్ 1వ తేదీకల్లా దేశ రాజధానిలో తిరిగే క్యాబ్స్, ఈ-కామర్స్ వాహనాలన్నీ ఎలక్ట్రిక్‌కు షిఫ్ట్ అవ్వాలని ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లోట్ స్పష్టం చేశారు.
ఢిల్లీ సర్కారు తీసుకొస్తున్న కొత్త వాహన పాలసీని ట్రాన్స్పోర్ట్, లెఫ్టినెంట్ గవర్నర్లు ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాతే ఇది అమల్లోకి రానుంది. నూతన పాలసీలో అగ్రిగేటర్లు ఎలక్ట్రిక్ బైక్ టాక్సీలను మాత్రమే నడిపేందుకు అనుమతిస్తారు. దీని వల్ల రవాణా రంగానికి మరింత ఊతం ఇచ్చినట్లు అవుతుందని మంత్రి కైలాష్ గెహ్లోట్ చెప్పారు. అందుబాటు ధరల్లో సిటీ అంతటా సర్కారు మరిన్ని ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం అమలుకు దశల వారీగా ప్రణాళికలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూపొందించారు. ఢిల్లీ సర్కారు తీసుకొస్తున్న ఈ కొత్త పాలసీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
No petrol, diesel or CNG cabs in #Delhi in future: Set to be replaced with fully-electric vehicles by the end of this decade! Details here –@TransportDelhi #EVhttps://t.co/G92gCfKMto
— TOI Auto (@TOIAuto) April 8, 2023