జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో 2020లో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు వాయిదాపడి ఈ ఏడాది నిర్వహిస్తున్నారు.14 క్రీడా విభాగాలకు మొత్తం 102 మంది భారతీయ అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్ కోసం అర్హత సాధించారు. టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతక విజేతలకు రూ.3కోట్ల బహుమతి ఇవ్వాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టోక్య ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడానికి ఢిల్లీకి చెందిన నలుగురు అథ్లెట్లు ఎంపికయ్యారు. టోక్యో వెళ్లే క్రీడాకారులకు మద్ధతుగా ఢిల్లీ స్పోర్ట్సు యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ కరణం మల్లీశ్వరి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధిస్తే రూ.3కోట్లు, రజతపతకం సాధించిన వారికి రూ.2కోట్లు, కాంస్య పతకం విజేతలకు కోటిరూపాయల నగదు బహుమతి ఇస్తామని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రకటించారు.
విజేతలైన అథ్లెట్ల కోచ్ లందరికీ రూ.10లక్షల చొప్పున ఇస్తామని సిసోడియా చెప్పారు. ఢిల్లీకి చెందిన అథ్లెట్లు దీపక్ కుమార్, మణికాబాత్రా, అమెజ్ జాకబ్, సర్తక్ బాంబ్రీ లు టోక్యోకు వెళుతున్నారు. ఖేల్ రత్న అవార్డు గ్రహీత మణికా బాత్రా టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఈవెంట్‌లో దీపక్ కుమార్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు.4×400 మీటర్ల రిలేలో అమోజ్ జాకబ్, 4 x 400 మీటర్ల రిలేలో ఢిల్లీకి చెందిన సార్థక్ భాంబ్రీలు పాల్గొంటారు. ఢిల్లీలో క్రీడలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు. విద్యార్థుల క్రీడా సామర్ధ్యాన్ని బట్టి శిక్షణ ఇస్తామని కరణం మల్లీశ్వరి చెప్పారు.
కిందటి నెలలో టోక్యో ఒలింపిక్స్‌లో పోటీ చేసే భారతీయ క్రీడాకారులకు తమిళనాడు సీఎం స్టాలిన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన క్రీడాకారులకు మూడు కోట్ల నగదు ఇవ్వనున్నట్లు వెల్లడించిన సంగతి విదితమే.