మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. పురుషులతో సమానంగా వైద్య, ఉద్యోగ రాజకీయ రంగాల్లో తన ప్రతిభను చాటుకుంటున్నారు. మగవారితో సమానంగా ఎన్నో సాహసాలు కూడా చేస్తున్నారు. ఉద్యోగం.. వ్యాపార రంగాల్లో రాణిస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు.
ప్రపంచంలో అన్ని రంగాల్లో మగవారితో సమానంగా ఆడవాళ్లు తమ సత్తా చాటుతున్నారు. వైద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మగవారికి ధీటుగా తామేంటో నిరూపిస్తున్నారు. కానీ ఇప్పటికీ కొన్ని చొట్ల ఆడపిల్లలంటే వివక్ష కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు కుటుంబంలో మగవారే అన్ని బాధ్యతలు మోసేవారు.. ఇప్పుడు ఆడవాళ్లు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. తల్లిదండ్రుల కష్టాలు కొడుకులు మాత్రమే అర్థం చేసుకుంటారని భావిస్తుంటారు.. కానీ కూతుళ్లు కూడా కుటుంబం కోసం తమ వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులకు ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ భరోసా ఇస్తున్నారు అమ్మాయిలు. తన తల్లి పాము కాటుకు గురైతే ఏమాత్రం భయపడకుండా విషాన్ని పీల్చి తల్లిని రక్షించుకుంది ఓ కూతురు.. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ పుత్తూరు జిల్లా కెయ్యూర్ గ్రామంలో సతీశ్, మమత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల మమత పొలం పనులు చేస్తుండా హఠాత్తుగా పాము కాటు వేసింది. దాంతో మమత భయంతో తనను పాము కాటు వేసిందని కేకలు వేసింది. అక్కడే ఉన్న మమత కూతురు శ్రవ్య పరుగున వచ్చి ఏమాత్రం ఆలోచించకుండా తన నోటితో పాము కాటు వేసిన చోట మూడుసార్లు విషాన్ని లాగి ఉమ్మేసింది. తరువాత స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యం చేసిన అనంతరం మమత కోలుకుంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
పాము కాటుకు గురైన వెంటనే కొంతమందికి ఏం చేయాలో పాల్పోదు.. కానీ తన తల్లిని రక్షించుకునేందుకు ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమె శరీరంలోకి విషం ఎక్కేలోపు మొత్తం లాగేసి పెద్ద ప్రమాదం నుంచి కాపాడిన శ్రవ్య ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. కంటే ఇలాంటి కూతురునే కనాలి అంటూ అభినందనలతో ముంచెత్తారు. ప్రస్తుతం శ్రవ్య బీసీఏ చదువుతుంది. తల్లిని పాము కాటు నుంచి రక్షించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన స్థానికులు, నెటిజన్లు శ్రవ్యను ఎంతగానో మెచ్చుకుంటున్నారు.