పెళ్లంటే నూరెళ్ల పంట అని పెద్దలు అంటుంటారు. పెళ్లి బంధంతో ఒక్కటైన జంట కలిసి జీవించినంత కాలం తోడునీడుగా ఉండాలని భావిస్తారు. ఒకరిపై ఒకరు ప్రాణాలు పెట్టుకుని బతుకుతారు. అయితే, కొన్ని సార్లు వివాహ బంధంలో అనుకోని విషాదాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. జంటలో ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోవటం జరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో జంటలోని ఒంటరి వ్యక్తి జీవితంలో శూన్యం నెలకొంటుంది. కొంతకాలానికి చనిపోయిన వ్యక్తి గురించి బాధపడటం ఆగిపోయినా.. ఒంటరి తనం అలాగే మిగిలిపోతుంది. మనసులో తోడు కావాలని ఉన్నా.. సమాజం కోసం ఆగిపోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా పెళ్లయి పెళ్లీడుకు వచ్చిన పిల్లలు ఉన్న వారి సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కడుపున పుట్టిన వారే ఒంటరిగా అల్లాడిపోతున్న తల్లి లేదా తండ్రి గురించి పెద్దగా ఆలోచించరు.
పెళ్లి, తోడు అన్న ఆలోచన అస్సలు చేయరు. కానీ, కొన్ని అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. కొన్నేళ్ల క్రితం కేరళకు చెందిన ఓ యువకుడు తన తల్లికి రెండో పెళ్లి చేశాడు. తాజాగా, కూడా ఓ యువతి తన తల్లికి మళ్లీ పెళ్లి చేసింది. తల్లి కళ్లలో ఆనందాన్ని చూసి మురిసిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మౌషుమి అనే మహిళ టీచర్‌గా పని చేసేది. కూతురు పుట్టి పెద్దదయిన తర్వాత భర్త చనిపోయాడు. దీంతో ఆమె తన తల్లి దగ్గరకు వెళ్లిపోయింది. కూతురు డెబ్ ఆర్తీతో తల్లి దగ్గరే నివసించసాగింది. ఈ నేపథ్యంలోనే ఒంటరిగా తల్లి పడుతున్న కష్టాలను చూసి కూతురు చలించిపోయింది. పెళ్లి చేసుకోమని చాలా రోజులు తల్లిని బతిమాలింది. కానీ, మౌషుమి ఒప్పుకోలేదు.
‘‘నేను మళ్లీ పెళ్లి చేసుకుంటే నీ పరిస్థితి ఏమవుతుంది?’’ అంటూ ఉండేది. ఓ రోజు కూతురి బలవంతం మేరకు పెళ్లికి ఒప్పుకుంది. డెబ్ ఆర్తీనే దగ్గరుండి తల్లికి పెళ్లి చేసింది. గత మార్చి నెలలో ఈ పెళ్లి జరిగింది. తల్లిని పెళ్లికి ఒప్పించటంపై ఆర్తీ ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ మళ్లీ పెళ్లి చేసుకోమని మా అమ్మను ఒప్పించటానికి చాలా టైం పట్టింది. ఎవరితోనైనా ఫ్రెండ్ అవ్వమని నేను చెబుతూ ఉండేదాన్ని. ఓ వ్యక్తిని చూపించి అతడితో ఫ్రెండ్షిప్ చేయమన్నాను. వాళ్లు ఫ్రెండ్స్ అయిన తర్వాత పెళ్లి ఏర్పాటు చేశాను’’ అని తెలిపింది. పెళ్లయిన మూడు నెలల తర్వాత తల్లి పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను డెబ్ ఆర్తీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆర్తీ చేసిన గొప్ప పనిని ప్రశంసిస్తున్నారు.