బలరాముడు దాదాపు 14 సంవత్సరాలుగా మైసూర్ దసరా జంబూసవారి సమయంలో బంగారు అంబారీని మోశాడు. గత కొద్ది రోజులుగా అతడి ఆరోగ్యం క్షీణించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..
మైసూర్ దసరా జంబూసవారి సమయంలో ఏనుగుల బృందానికి సారథ్యం వహించిన బలరాముడు అనే వృద్ధ ఏనుగు అనారోగ్యంతో కన్నుమూసింది. గత కొంత కాలంగా అనారోగ్య కారణంగా ఇబ్బందులు పడుతున్న బలరాముడు డాక్టర్లు చికిత్స అందిస్తున్నప్పటికీ కోలుకోలేకపోయాడు. చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. దసరా సందర్భంగా మైసూర్ ఆలయంలో జరిగే ఉత్సవాల్లో బలరాముడు ఇప్పటివరకు 14 సార్లు.. అంటే 14 సంవత్సరాలు వరుసగా అంబారీని మోసుకెళ్లాడు. వయోభారం కారణంగా బలరాముడికి నోట్లో పుండ్లు కావడం వల్లనే అనారోగ్యానికి గురయ్యాడని వైద్యులు వెల్లడించారు. నోట్లో పుండ్లు కావడంతో మంచి నీళ్లు తప్ప వేరే పదార్థాలు ఏమి తీసుకోలేదని అన్నారు. దీంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని వైద్యులు తెలిపారు.
ఏనుగు ఆరోగ్య సమస్యను తెలుసుకునేందుకు ఎండోస్కోపీ కూడా చేశారు. పరిస్థితి విషమించటంతో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే బలరాముడు నాగర్ హూళే పార్క్ లోని భీమనకట్టో ఏనుగుల శిభిరంలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా, కొన్నేళ్ల క్రితం కర్నాటకలోని సోమవారపేట సమీపంలో ఉన్న కట్టేపూర్ అడవులనుంచి గున్న ఏనుగుగా ఉన్నప్పుడే బలరాముడిని తీసుకొచ్చారు. దసరా ఉత్సవాలకోసం మచ్చిక చేసుకున్నారు. బలరాముడు దాదాపుగా 20 సంవత్సరాలనుంచి దసరా వేడుకల్లో పాల్గొంటున్నాడు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.