ఈరోజుల్లో 17సంవత్సరాల కుర్రాళ్ళు ఎలా ఉంటారు? చేతిలో ఫోన్ పట్టుకుని గేమింగ్ లో మునిగిపోతారు. లేదా ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతూ ఉంటారు. అందరూ అలా ఉంటారు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే అంటున్నాడు ఓ కుర్రాడు. అతడి పేరే ప్రేమ్ కుమార్. ఇప్పుడు ప్రపంచం మెుత్తం అతని వైపే చూస్తుంది. దానికి కారణం అతడు సాధించిన స్కాలర్ షిప్. స్కాలర్ షిప్ అంటే వేలల్లో, లక్షల్లో కాదు ఏకంగా కోట్లల్లో. అవును మీరు విన్నది నిజమే. అతడు సాధించిన స్కాలర్ షిప్ అక్షరాల రూ.2.5 కోట్లు. అలా అని అతనికి సకల సౌకర్యాలు ఉన్నాయి అనుకుంటే పొరపాటే.. మరి.. పేదరికం నుంచి కోట్ల స్కాలర్ షిప్ అందుకునే స్థాయికి వెళ్లిన అతని విజయ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అతని పేరు ప్రేమ్ కుమార్. వయసు 17 ఏళ్లు. చదువు అంటే అమితమైన ప్రేమ. చాలా తెలివిగల వాడు. బీహార్ లోని పాట్నా దగ్గర్లోని గోపాల్‌పురా జిల్లాలోని మారుమూల గ్రామం. తల్లి లేదు. తండ్రి రోజువారి కూలీ. అయనకు చదువంటే తెలీదు. ఆ ఊళ్లో కూడా ఎవ్వరికీ చదువు రాదు. కానీ, ప్రేమ్‌కుమార్‌కి మాత్రం చదువు అంటే చాలా ఇష్టం. చదువుకుంటేనే మంచి భవిష్యత్తు అని అనుకున్నాడు. అందుకే, ఎన్నికష్టాలు ఎదురైనా కష్టపడి చదువుకున్నాడు. ప్రపంచంలోనే కేవలం ఆరుగురికి మాత్రమే దక్కే స్కాలర్‌షిప్‌ను కష్టపడి చదివి సాధించాడు ప్రేమ్.
అమెరికాలో గల పెన్సిల్వేనియాలోని లాఫాయేట్ కాలేజీలో నాలుగేళ్ల పాటు మెకానికల్ ఇంజినీరింగ్ చేయనున్నాడు. దానికి గాను అతనికి రూ.2.5 కోట్ల స్కాలర్‌షిప్ వరించింది. ఇది అమెరికాలోని టాప్-25 కాలేజీల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఆరుగురికి మాత్రమే ఈ అవకాశం దక్కింది. అందులో ప్రేమ్ ఒకడు. పెన్సిల్వేనియాలోని ఈ కాలేజి ఏటా పరీక్ష నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగానే ప్రేమ్ కూడా ఆ పరీక్ష రాశాడు. చాలా కష్టమైన ప్రశ్నలను తక్కువ టైంలో పూర్తి చేసేవారికి ఈ స్కాలర్‌షిప్ ఇస్తారు.
నాలుగేళ్ల పాటు అమెరికాలో చదువుకునేందుకు, అక్కడ ఖర్చులకు కూడా ఆ డబ్బు సరిపోతుందని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. తల్లిలేదు. తండ్రికి చదువురాదు. ఊరిలో సరైన బడీ లేదు. కానీ, చదువుకోవాలనే సంకల్పం మాత్రమే ఉంది. అదే అతడిని సముద్రాలు దాటేలా చేసింది. ప్రపంచంలో ఆరుగురిలో ఒకడిగా నిలబెట్టింది. కూలీ కొడుకైతే ఏంటి.. కష్టపడి చదివి, తెలివితో ఆలోచిస్తే ఎన్ని అద్భుతాలైనా చేయొచ్చు అని నిరూపించాడు ప్రేమ్. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న ప్రేమ్ స్టోరీ చూసిన మీకు ఏం అనిపిస్తుంది? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.