ఇటీవల పురుషులకు టోకరా ఇస్తున్నారు మహిళలు. జల్సాల కోసం డబ్బు సంపాదనే లక్ష్యంగా అమాయకులైన కొంత మంది పురుషులను మభ్య పెట్టి ప్రేమ, పెళ్లి వలలు విసిరి అందిన కాడికి దోచుకుందో మహిళ. నిత్య పెళ్లి కూతరు అవతారమెత్తి.. పోలీసులకు సైతం షాక్ నిచ్చింది.
ఇటీవల కాలంలో మహిళల అరాచకాలు కూడా నానాటికి పెరుగుతున్నాయి. మాయగాళ్లు కాదూ కిలాడీ లేడీలు తయారయ్యారు. విలాసాల కోసం, డబ్బు ఆర్జించే పనిలో ఎంతటీ మోసానికైనా పాల్పడుతున్నారు. ఇందుకు ప్రేమ, పెళ్లి వంటి వాటిని ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారు. అందిన కాడికి దోచేస్తున్నారు. వారి మోసాలకు బలైన అబ్బాయిలు తర్వాత లబోదిబోమంటున్నారు. అటువంటి ఉదంతమే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదూ ఏకంగా 9 మందిని పెళ్లి చేసుకుని ఉడాయించిదో ప్రబుద్ధురాలు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కడలూరు జిల్లా బన్ రూటీ సమీపంలో వాణియంపాళయం గ్రామానికి చెందిన అరుల్ రాజ్.. చెరుకు కార్మికుడు. అతను ఎక్కువగా ఫేస్ బుక్ వినియోగించే వాడు. అలా మహాలక్ష్మి అనే మహిళ పరిచయమైంది. తనదీ వేలూరు అని, తనకు ఎవ్వరూ లేరని, దిక్కుతోచని స్థితిలో ఉన్నానంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పింది. ఆమె దీన గాధ విన్నఅరుల్ ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఇంకేముందీ గత ఏడాదీ ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఓ అద్దె ఇళ్లు తీసుకుని జీవిస్తున్నారు. అయితే అరుల్ చెరుకు కోతకు సంబంధించి వేరో ప్రాంతాలకు వెళ్లేవాడు. అతడు లేని సమయంలో బంధువుల ఇళ్లకు వెళ్లి వస్తానని చెప్పి మహిళ వెళ్లిపోయేది.
అయితే చెల్లెలి పెళ్లి కోసమని 7 సవర్ల నగలు, రూ. 90వేల నగదును ఇంట్లో ఉంచాడు. అయితే తన స్నేహితురాలికి బాలేదంటూ చెన్నైకి వెళ్తున్నానని చెప్పి మహాలక్ష్మి వాటిని తీసుకుని ఉడాయించింది. ఎన్ని రోజులకు రాకపోవడంతో పాటు ఫోన్లు చేసినా తీయకపోవడంతో అరుల్ అనుమానం వచ్చింది. ఆమె గతంలో చెప్పిన అడ్రస్ కు వెళ్లి అడగ్గా.. అసలు విషయాలు తెలిశాయి. ఈ క్రమంలో మరిన్నీ వివరాలు తెలియడంతో షాక్ అవ్వడం అరుల్ వంతైంది. తనలాగే చాలా మందిని మోసం చేసినట్టు గ్రహించాడు. తనకు తల్లిదండ్రులు, బంధువులు లేరని మాయమాటలు చెప్పి పెళ్లిళ్లు చేసుకుని, ఆ తర్వాత నగలు, డబ్బులు తీసుకుని ఉడాయించేదని తేలింది.
దీంతో అరుల్ మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఒకరూ ఇద్దరూ కాదు ఏకంగా తొమ్మిది మందికి పైగా వివాహం చేసుకున్నట్లు తేలింది. వేలూరు, కోయంబత్తూరు, తిరువణ్ణామలై, ఈ రోడ్ లకు చెందిన యువకులను పెళ్లి చేసుకుని, కొన్నేళ్ల కాపురం తర్వాత దొరికిన కాడికి దోచుకునేదని తేలింది. సోషల్ మీడియా ద్వారానే వీరూ మోసపోయినట్లు గుర్తించారు. ఎనిమిది మందిని పెళ్లి చేసుకోగా.. తొమ్మిదో బాధితుడే అరుల్. అయితే బాధితుల సంఖ్య ఎక్కువే ఉండవచ్చుని పోలీసులు భావిస్తున్నారు. మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.