ఆడపిల్లలగా పుట్టిన నాటి నుండే ఎంత కట్నం ఇచ్చి పెళ్లి చేయాలో అని ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు. అమ్మాయిలు దొరకడమే కరువు అవుతున్న ఈ రోజుల్లో కూడా వరకట్నదాహానికి బాధితులవుతున్నారు. అమ్మాయితో పాటు వరకట్నం, పొలం, స్థలం, వాహనాలు, ఇంటి నిండా సామాను పంపుతున్నా.. ఇంకా ఏదో పుట్టింటి నుండి అడిగి తీసుకు రావాలని భర్త, అత్తింటి వారు వేధిస్తూనే ఉంటున్నారు
‘కట్నం కట్నం అంటారేందిరో ఓ పెద్దల్లారా.. కట్నం కట్టుకుపోతారేందిరో’అన్నట్లు నిజంగా వరకట్నం ఇంకా దేశంలో అంతరించిపోలేదు. దీని కారణంగా అనేక మంది అబలలు బలవుతున్నారు. ఆడపిల్లలగా పుట్టిన నాటి నుండే ఎంత కట్నం ఇచ్చి పెళ్లి చేయాలో అని ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు. అమ్మాయిలు దొరకడమే కరువు అవుతున్న ఈ రోజుల్లో కూడా వరకట్నదాహానికి బాధితులవుతున్నారు. అమ్మాయితో పాటు వరకట్నం, పొలం, స్థలం, వాహనాలు, ఇంటి నిండా సామాను పంపుతున్నా.. ఇంకా ఏదో పుట్టింటి నుండి అడిగి తీసుకు రావాలని భర్త, అత్తింటి వారు వేధిస్తూనే ఉంటున్నారు. పిల్లలకు పెళ్లి చేసి అప్పులు తీర్చుకుంటూ బతుకుతున్న తల్లిదండ్రులను అప్పుడప్పుడు అడిగి తెస్తున్నా.. వారి ఆశకు హద్దు లేకుండా పోతుంది. ఇంకా ఇంకా తేవాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. కాదంటే దాడి చేయడం.. కొన్ని సార్లు అఘాయిత్యాలకు ఒడిగట్టడం జరుగుతుంది.
తాజాగా అటువంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. వరకట్న వేధింపులకు బంగారు బొమ్మ లాంటి అమ్మాయి అశువులు బాసిన ఘటన కోలారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖాద్రిపురకు చెందిన మధు అనే యువకుడితో బంగారు పేట తాలూకా దొడ్డూరు గ్రామానికి చెందిన అంబిక (25)తో నాలుగేళ్ల క్రితమే వివాహమైంది. మధు ప్లంబర్, వాటర్ ఫిల్టర్ రిపేరీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. ఈ క్రమంలో మధు మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. తరచుగా అదనపు కట్నం తేవాలని పుట్టింటకి పంపేవాడు. అయితే ఈ విషయంపై అంబిక తల్లిదండ్రులు పెద్దలకు ఫిర్యాదు చేయడంతో.. పంచాయితీ చేసి రాజీ కుదిర్చారు.
అయినా మధు తీరులో మాత్రం మార్పు కనిపించలేదు. సోమవారం రాత్రి కూడా పీకలదాకా తాగి వచ్చిన మధు భార్యతో గొడవపడ్డాడు. తెల్లారే సరికి ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. అయితే మధు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతుండగా.. అంబిక ఆత్మహత్య చేసుకోలేదని, భర్తే ఆమెకు ఉరి వేసి చంపాడని ఆమె చిన్నాన్న వెంకటరామప్ప, బంధువు రాజేంద్ర ఆరోపించారు. ఆమెదీ ముమ్మాటికి హత్యేనని అంటున్నారు. అంబిక బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కోలారు రూరల్ పోలీసులు మధును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.