ఆవును ప్రపంచంలోని ప్రతీ హిందువు పరమ పవిత్రంగా భావిస్తాడు. ఆవు మూత్రాన్ని తాగే వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే, తాజా పరిశోధనల్లో ఆవు మూత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆవును ఎంతో పరమ పవిత్రమైన జంతువుగా హిందువులు భావిస్తూ ఉంటారు. ఎంతో భక్తి, శ్రద్దలతో పూజిస్తూ ఉంటారు. ఆవు విసర్జనలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కొంతమంది హిందువులు ఆవు మూత్రాన్ని తాగుతూ ఉంటారు. ఆవు మూత్రం ఎంతో పవిత్రమైనదని, దాని వల్ల మానవ శరీరంలోని ఎన్నో వ్యాధులు నయం అవుతాయని భావిస్తూ ఉంటారు. అయితే, ఆవు మూత్రం నేరుగా తాగటం మనుషులకు మంచిది కాదని తాజా పరిశోధనల్లో తేలింది. ఆవుల మూత్రం కంటే ఎద్దుల మూత్రం కొన్ని రకాల బ్యాక్టీరియాలపై ప్రభావవంతంగా పోరాడుతుందని తేలింది.
ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీకి చెందిన ఐసీఏఆర్-ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐవీఆర్‌ఐ) జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ భోజ్ రాజ్ సింగ్‌తో పాటు మరికొంతమంది పీహెచ్‌డీ విద్యార్థులు ఆవులు, ఎద్దుల మూత్రంపై పరిశోధనలు చేశారు. దాదాపు 75 శాంపిల్స్‌పై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆవు, ఎద్దు మూత్రంలో 14 రకాల హానికరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఎసెరీసియా కోలీ అనే బ్యాక్టీరియా కారణంగా కడుపు సంబంధింత సమస్యలు వచ్చే అవకాశం ఉందని వెల్లడైంది.
ఆవుల కంటే ఎద్దుల మూత్రంలో ఎక్కువ యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఉందని తెలియవచ్చింది. కేవలం ఆవు మూత్రమే యాంటీ బ్యాక్టీరియల్ అని చెప్పటానికి వీల్లేదని పరిశోధకులు తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనుషులు మూత్రాన్ని తాగకూడదని హెచ్చరించారు. తాజా ఆవు మూత్రంలో ఎక్కువ హానికరమైన బ్యాక్టీరియా ఉంటుందని తెలిపారు. దాన్ని నేరుగా తీసుకోవటం మంచిది కాదని పేర్కొన్నారు. మరి, ఆవు, ఎద్దు మూత్రంపై జరిగిన ఈ తాజా పరిశోధనలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.