ఏ నేరం చేయలేదు.. అన్యాయంగా 301 రోజులు జైలు జీవితం గడిపారు

జైలుకెళ్లిన ప్రతి ఒక్కరూ నేరస్తులవ్వాలని లేదు. కొంతమంది నిర్దోషులు కూడా ఉంటారు. ఏ నేరం చేయకున్నా కూడా కొన్ని సందర్భాల్లో జైలు జీవితం అనుభవించే వారు ఉంటారు. అలాంటి వారిలో ఈ దంపతులు కూడా ఉన్నారు.

  • Written By:
  • Publish Date - June 3, 2023 / 12:07 PM IST

కొన్ని సార్లు ఏ తప్పూ చేయకపోయినా పోలీసులు అనుమానం కారణంగా జైల్లో శిక్ష అనుభవించే వారు ఉంటారు. అన్యాయంగా అమాయకులను జైల్లో పెడుతుంటారు. పూర్తిగా కేసును స్టడీ చేయకుండా అనుమానం ఉందన్న కారణంగా నేరం చేశారని తీర్పు ఇచ్చేసి జైల్లో పెడతారు. ఆ తర్వాత నిర్దోషి అని తెలిసి నాలుక కరుచుకుని విడుదల చేస్తారు. కానీ అప్పటి వరకూ జైలు జీవితం గడిపిన వారి మానసిక పరిస్థితి ఏంటి? ఆర్థిక స్థితి ఏంటి? జరిగిన నష్టానికి బాధ్యులెవరు? అనే దాని గురించి ఎవరో పట్టించుకోరు. ఇలాంటి సంఘటనే భార్యాభర్తల జీవితంలో చోటు చేసుకుంది. పేదవారిగా పుట్టడమే వారికి శాపమైంది. తాము నిర్ధోషులమని నిరూపించుకోవడానికి పోరాడే శక్తి లేకపోవడమే వారి పాలిట శాపమైంది.

ఏ తప్పూ చేయలేదు. అయినా గానీ ఈ దంపతులు అన్యాయంగా జైలు జీవితం గడిపారు. ఒకటి, రెండు రోజులు కాదు ఏకంగా 301 రోజులు జైల్లో ఉన్నారు. చేయని నేరానికి దాదాపు 10 నెలలు శిక్ష అనుభవించారు. పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్వాన్ కు చెందిన పలాష్, శుక్ల అధికారి అనే దంపతులు పొట్ట కూటి కోసం బెంగళూరుకు కూలీలుగా వచ్చారు. వీరికి రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. అయితే అక్రమ బంగ్లాదేశీ వలసదారులన్న అనుమానంతో 2022 జూలై నెలలో బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. విదేశీయుల చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. అయితే తాము పశ్చిమ బెంగాల్ లోని తూర్పు బుర్ద్వాన్ లోని జమాల్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జౌగ్రామ్ కి చెందిన వారమని శుక్ల అధికారి, అతని భార్య పలాష్ బెంగళూరు పోలీసులకు ఎంత చెప్పినా వినలేదు.

బెంగళూరు నగర శివారులో ఉన్న సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ తర్వాత పోలీసులు తూర్పు బుర్ద్వాన్ లో ఉన్న పలాష్ ఇంటిని చెక్ చేశారు. స్థానిక జమాల్ పూర్ బీడీఓను సంప్రదించి పత్రాలను సరిచూసుకున్నారు. పలాష్ బంధువులు బెంగళూరుకు చేరుకొని బెయిల్ పిటిషన్ వేశారు. ఎట్టకేలకు దంపతులకు ఏప్రిల్ 28న బెయిల్ మంజూరైంది. అయితే దంపతులకు చెందిన భూమి పత్రాలను ఆలస్యంగా సమర్పించడంతో మే 24న జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో దంపతులు తమ సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. వీరు బయటకు రావడం కోసం శుక్ల అధికారి సోదరి సతీ అధికారి ఎంతగానో సహాయం చేశారు. బ్యూటీ పార్లర్ నడుపుతున్న సతీ అధికారి తన సంపాదనను కేసు పోరాటం కోసం ఖర్చు పెడుతున్నారు.

మే 24న ఉదయం 9.30 గంటలకు అన్న, వదినలు విడుదలవుతున్నారని తెలిసి వీడియో కాల్ ద్వారా మాట్లాడానని.. ఆ సమయంలో తన తల్లికి కన్నీళ్లు ఆగలేదని సతీ అధికారి వెల్లడించారు. వాళ్ళు చాలా నీరసంగా ఉన్నారని.. తన మేనల్లుడుతో మాట్లాడానని అన్నారు. ప్రస్తుతం దంపతులిద్దరూ తమ సొంత గ్రామంలోనే ఉన్నారు. మరి వీరు తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతారా? లేదా? ఈ సంఘటనపై మీ అభిప్రాయమేమిటి? ఒకటి, రెండు రోజులు కాదు ఏకంగా 301 రోజులు ఏ నేరం చేయకున్నా జైలు జీవితం గడిపేందుకు కారణమైన వారిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed