దున్నపోతులా తిని తొంగోడం కాదు, కాస్త పని కూడా చేసి పైసలు సంపాదించాలి అని తండ్రులు సోమరిపోతు కొడుకులను తిడుతూ ఉంటారు. అలా ఎవరైనా తిట్టే వారు ఉంటే ఒకసారి ఈ దున్నపోతును చూడండి. మనసు మార్చుకుంటారు. ఎందుకంటే మిగతా దున్నపోతుల్లా ఎక్కువే తిన్నా ఏడాదికి కోటి రూపాయలు సంపాదించి పెడుతుంది రైతుకి. మరి ఆ దున్నపోతు ఎవరు? దాని చరిత్ర ఏంటి? యజమాని ఎవరు? ఎక్కడిది? మేపడానికి దాని ఖర్చు ఎంత? ఆ వివరాలు మీ కోసం.
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో జరిగిన జాతీయ వ్యవసాయ ప్రదర్శన జరిగింది. రైతులకు పశుపోషణ, వ్యవసాయంలో వివిధ అంశాలపై సమాచారం ఇచ్చి, అవగాహన కల్పించేందుకు 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి రైతులు వారి పశువులను తీసుకొచ్చారు. దేశం నలుమూలల నుంచి దాదాపు 50 వేల మంది రైతులు, పశువుల కాపరులు 1200 పశువులతో ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ఒక దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే దీని వెల అక్షరాలా 10 కోట్లు. దీనితో సెల్ఫీలు దిగేందుకు జనాలు తెగ ఎగబడ్డారు.
దాని పేరు ఘోలు-2. వ్యవసాయ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని వయసు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే దీని యజమాని నరేంద్ర సింగ్.. పానిపట్ కి చెందిన రైతు. ఈ దున్నపోతుకి కుటుంబ చరిత్ర ఉందని నరేంద్ర సింగ్ వెల్లడించాడు. ఘోలు గాడి తల్లి పేరు రాణి, తండ్రి పేరు పీసీ-483. వీడి తాత ఘోలు నేషనల్ ఛాంపియన్ గా పదకొండేళ్ళ ఉందని, ఇప్పుడు ఈ ఘోలు-2 కూడా నేషనల్ ఛాంపియన్ గా ఆరు సార్లు నిలబడిందని పేర్కొన్నాడు. మార్చి 13న హర్యానాలోని దాద్రిలో జరిగిన జంతు ప్రదర్శనలో పాల్గొన్న ఘోలు-2 దున్నపోతు ఉత్తమ జంతువుగా అవార్డు, రూ. 5 లక్షల రివార్డు గెలుచుకుంది. ఈ దున్నపోతును మేపాలంటే ఏడాదికి రూ. 4 లక్షల ఖర్చు అవుతుందని నరేంద్ర సింగ్ వెల్లడించాడు. ఈ దున్నపోతు రెండు రోజులకు 30 కిలోల పచ్చ పొడి గడ్డి, 10 కిలోల శనగలు తింటాదని నరేంద్ర సింగ్ వెల్లడించాడు. దీన్ని మేపడానికి నెలకు 30 వేలు పైనే ఖర్చవుతుందని వెల్లడించాడు.
అయితే ఇంత తిన్నందుకు యజమానికి భారీగా లాభాలు పెడుతుంది ఈ ఘోలు-2 దున్నపోతు. ఏడాదికి కోటి రూపాయలు సంపాదించి పెడుతుంది. అంతలా సంపాదించడానికి ఏం చేస్తుంది అంటే.. కాంపిటీషన్స్ లో పాల్గొనడం, వెళ్ళినప్పుడల్లా 5, 10 లక్షలు తెచ్చుకోవడం లాంటివి చేస్తుంది. ఇక బ్రీడింగ్ కాన్సెప్ట్ ఎలాగూ ఉంటుంది కాబట్టి గేదెలను తీసుకొచ్చి ఘోలు గాడితో షో సెట్ చేస్తారు కావచ్చు. ఇది ముర్రా జాతికి చెందిన దున్నపోతు. దీని బరువు 16 క్వింటాళ్లు అంటే 1600 కిలోలు. రోజూ 10 కిలోమీటర్లు వాకింగ్ చేస్తుంది. అప్పుడే అది ఆరోగ్యంగా ఉంటుందని నరేంద్ర సింగ్ అంటాడు. మరి రైతుకి సిరుల పంట కురిపిస్తున్న ఈ బాహుబలి దున్నపోతుపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.