నేటి రోజుల్లో పెరుగుతున్న ధరలతో సాధారణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అని ఓ సినిమాలో చెప్పిన విధంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యుడి నడ్డివిరుస్తున్నాయి.
చాలీ చాలని సంపాధనతో కుటుంబాలను నెట్టుకొస్తున్న వారికి ధరల పెరుగుదల నరకంగా మారింది. ముఖ్యంగా ఇళ్లల్లో నిత్యం ఉపయోగించే వంట నూనె ధరలు వంటింట్లో మంట పెడుతున్నాయి. వంట నూనెల ధరలపై నియంత్రణ లేక సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
గతంతో పోలిస్తే ప్రస్తుతం ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఎంతో కొంత ఆదాయాన్ని సంపాదిస్తూ కుటుంబాన్ని నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న వంట నూనెల ధరలు సామాన్యుడిని కలవరపెడుతున్నాయి. ధరల నియంత్రణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికి అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల దేశీయంగా వంట నూనెల ధరలపై ప్రభావం పడుతోంది. కాగా తాజాగా కేంద్ర ప్రభుత్వం వంట నూనెల ధరలను తగ్గించేందుకు శ్రీకారం చుట్టింది.
దేశీయంగా వంట నూనెలను ఉత్పత్తి చేస్తున్నప్పటికి అవి డిమాండ్ కు తగ్గట్టు సరిపోవడం లేదు. దీంతో విదేశాల నుంచి పలు రకాల నూనెలను దిగుమతి చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో 1మిలియన్ పైగా వంటనూనెలను దిగుమతి చేసుకుంది. అయితే కేంద్రం దిగుమతి చేసుకునే ఆయిల్ పై దిగుమతి సుంకాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వంట నూనెల ధరలు మరింత తగ్గనున్నాయి. రిఫైన్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్ దిగుమతులపై ఇదివరకు 17.5 శాతం ఉన్న సుంకాన్ని 12.5 శాతానికి తగ్గించింది. ఈ కారణంగా వంట నూనెల ధరలు తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్యులకు అధిక ధరల నుంచి కొంత ఉపశమనం లభించినట్లవుతుంది.